జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
  • కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన 
  • 19 సిట్టింగులతో 25 రోజులపాటు మాన్‌‌‌‌సూన్ సెషన్
  • 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై నివేదిక ఇవ్వనున్న జేపీసీ
  • రక్షణ మంత్రిపై ప్రివిలేజ్ మోషన్‌‌‌‌కు 
  • ప్రతిపక్షాల వ్యూహం

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఈ నెల 20 నుంచి వచ్చే నెల13 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాల కోసం ఈ సమావేశాలు జులై 20న ప్రారంభమై, ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి’’ అని ఆయన శనివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. వర్షాకాల సమావేశాలు19 సిట్టింగులతో మొత్తం 25 రోజులపాటు జరుగుతాయని తెలిపారు. 

కాగా, వివాదాస్పద130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ నెల17న తన నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్ట్ అయ్యి, వరుసగా 30 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించాలనే బిల్లులోని అత్యంత చర్చనీయాంశమైన నిబంధనను అలాగే ఉంచే సూచనలు కనిపిస్తున్నాయి. 

అయితే, రాజకీయ కక్షసాధింపు చర్యల కోసం ఈ నిబంధనను దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో కొన్ని రక్షణ చర్యలను ఈ నివేదికలో చేర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతీయ సైనికుల మరణాల విషయమై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభను తప్పుదోవ పట్టించేలా ‘నేరుగా, స్పష్టమైన అబద్ధం’ చెప్పారని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో, ఆయనపై ప్రివిలేజ్ చర్యల అంశాన్ని కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది.

తిరుగుబాట్లతో ప్రతిపక్షాల్లో చీలిక.. 

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), శివసేన (యూబీటీ)లలో జరిగిన తిరుగుబాటు పరిణామాలు రాబోయే సమావేశాల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. 20 మంది టీఎంసీ, ఆరుగురు శివసేన (యూబీటీ) ఎంపీలు ప్రత్యేక గ్రూపులుగా గుర్తింపు కోరుతూ చేసిన డిమాండ్లపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికార ఎన్‌డీఏ రాజకీయ బలం మరింతగా పెరిగిన తరుణంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. అలాగే, ఎగువ సభకు చెందిన ముగ్గురు తిరుగుబాటు టీఎంసీ ఎంపీలు రాజీనామా చేయడం, రాజ్యసభలో ఉప ఎన్నికలతో బీజేపీ మరింత బలాన్ని పుంజుకోనుంది.