కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం పతాక స్థాయికి చేరింది. శనివారం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ తనను రాజకీయంగా ఆపాలనుకునేవారు "చంపితేనే" అది సాధ్యమవుతుందని, అంతవరకు తాను లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడాన్ని ఆమె తీవ్ర ద్రోహంగా అభివర్ణించారు. పార్టీ అధికారిక గుర్తు తమతోనే ఉంటుందని, తిరుగుబాటుదారులు సుదీర్ఘ చట్టపరమైన పోరాటాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.
తిరుగుబాటుదారులు తనకు కేవలం 'సలహాదారు' పాత్రను ఆఫర్ చేశారని, అయితే, తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వారితో చేతులు కలపబోనని మమత తేల్చిచెప్పారు. బీజేపీ ఒత్తిళ్లకు లొంగి కొందరు నేతలు విడిపోయారని, కానీ తాను ఎవరికీ తలవంచబోనని స్పష్టం చేశారు. చంద్రితా నిష్క్రమణ తర్వాత తానే స్వయంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తన నివాసమే ప్రధాన టీఎంసీ కార్యాలయంగా పనిచేస్తుందని తెలిపారు.
