ముంబైలో కుండపోత.. జలమయమైన రోడ్లు.. స్తంభించిన జనజీవనం

ముంబైలో కుండపోత.. జలమయమైన రోడ్లు.. స్తంభించిన జనజీవనం
  • ఐఎండీ రెడ్ అలర్ట్.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
  • దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
  • ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాల అలర్ట్..  
  • రేపటి నుంచి ఢిల్లీలో భారీ వానలు

ముంబై: రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరంలో గడిచిన 24 గంటల్లో కుండపోతగా వర్షం పడింది. బాంద్రా, పరేల్, విఖ్రోలి, ఘట్‌‌కోపర్ సహా పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నగర సగటు వర్షపాతం 99 మిల్లీమీటర్లుగా రికార్డైంది. రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 
పట్టాలపైకి నీరు చేరడంతో లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సిటీలోని స్కూళ్లు, కాలేజీలకు ముందస్తుగా సెలవు ప్రకటించింది. ముంబైతో పాటు పరిసర జిల్లాలకు ఇండియా ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

నగరంలో రాబోయే రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. సముద్రంలో 4.26 మీటర్ల ఎత్తులో పోటు (హై టైడ్) వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇప్పటివరకు ఐదుగురు మృతి

వర్షాలతో మహారాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 30న ముంబైలో ఒక స్కూల్ బస్సుపై భారీ రావి చెట్టు కూలిపోవడంతో 11 ఏండ్ల బాలుడు,  రెండు రోజుల తర్వాత సాకినాక ప్రాంతంలో తెరిచి ఉన్న మ్యాన్‌‌హోల్‌‌లో పడి 55 ఏండ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. పుణెలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వదిలేసిన డ్రైనేజీ గుంతలో పడి రెండేండ్ల చిన్నారి నీట మునిగి చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. థానేలో నిలిచిన నీటిలో నడుస్తూ జారిపడిన ఒక మహిళ.. విద్యుత్ ట్రాన్స్‌‌ఫార్మర్ లైవ్ వైర్‌‌ను తాకడంతో కరెంట్ షాక్‌‌కు గురై మరణించింది.