- ప్రతిసారి 10 నెలల నుంచి ఏడాదికి పైగా ఆలస్యంగా యూనిఫాంలు పంపిణీ
- కాగితాల్లో 20 వస్తువులు.. క్షేత్రస్థాయిలో ఇచ్చింది మూడే
- కనీస అవసరాలు తీర్చడంలో సొసైటీల ఘోర వైఫల్యం
- గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై సీఎంకు ఉన్నతాధికారుల నివేదిక
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. నిరుపేద విద్యార్థుల వసతుల పంపిణీని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి శనివారం ఓ నివేదిక సమర్పించారు. అధికారులు 2014–15 నుంచి 2023–24 విద్యా సంవత్సరాల మధ్య జరిగిన సరఫరా ప్రక్రియపై లోతైన అధ్యయనం చేశారు.
కేంద్రీకృత పరిపాలన లోపాలు, పట్టింపులేకపోవడం వల్ల లక్షలాది మంది గురుకుల విద్యార్థులు సకాలంలో కనీస అవసరాలు అందక నానా అవస్థలు పడ్డారని తేలింది.ఏటా అకడమిక్ ఇయర్ జూన్, జూలై నాటికి విద్యార్థులకు విద్యా సామాగ్రి అందాలి. కానీ, ఈ సామాగ్రిని అందించడంలో గురుకుల సొసైటీలు నిరంతరం విఫలమయ్యాయని నివేదిక వెల్లడించింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల కేటాయింపులు, టెండర్లు, వస్తువుల పంపిణీపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులకు స్పష్టం చేశారు.
కాగితాలకే పరిమితమైన వసతులు
రిపోర్ట్ ప్రకారం..మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ పదేళ్లలో ఒక్కసారి కూడా సకాలంలో యూనిఫారాలు అందించలేదు. జూన్ 12 గడువు ఉన్నప్పటికీ విద్యార్థులకు దుస్తులు అందలేదు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ ఆలస్యం మరింత ఎక్కువైంది. జూన్ నెలలో అందాల్సిన దుస్తులను డిసెంబర్, జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పంపిణీ చేశారు. అంటే దాదాపు ఆరు విద్యా సంవత్సరాల్లో చలికాలం ముగిసే సమయంలో విద్యార్థులకు దుస్తులు అందాయి. అంతేకాకుండా బెల్టులు, టైలు, శానిటరీ కిట్లు, పీటీ డ్రెస్‌లు వంటి అత్యవసర వస్తువులను పదేళ్ల పాటు అసలు సరఫరానే చేయలేదు. ఎస్సీ సంక్షేమ గురుకులాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
గిరిజన సంక్షేమ హాస్టళ్లలో గడిచిన దశాబ్ద కాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2014 నుంచి 2022 వరకు వరుసగా 9 సంవత్సరాల పాటు వీరికి షూస్, సాక్స్, స్కూల్ బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు వంటి ప్రాథమిక సామాగ్రిని ప్రభుత్వం అందించలేదు. దీంతో 2014లో హాస్టల్‌లో చేరిన ఒక విద్యార్థి కనీసం ఒక స్కూల్ బ్యాగ్ లేదా జత బూట్లు కూడా లేకుండానే తన ప్రాథమిక విద్యను పూర్తి చేయాల్సి వచ్చింది. గురుకుల సొసైటీలలో కాగితాల మీద 15 నుంచి 20 వస్తువులను చూపించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం మూడు, నాలుగు వస్తువులనే సరఫరా చేశారు. వాటిని కూడా తీవ్ర ఆలస్యంగా పంపిణీ చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది.
