రేగొండ, వెలుగు: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని ఆమెభర్త తల్వార్ తో నరికి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జెట్టి శ్రావణ్(35), మల్లెబోయిన శ్రీకాంత్ స్నేహితులు. కొన్నేండ్లుగా వైన్స్ వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. దీంతో శ్రావణ్ అప్పుడప్పుడు శ్రీకాంత్ ఇంటికి వస్తుండేవాడు.
ఈక్రమంలో శ్రీకాంత్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన శ్రీకాంత్ స్నేహితుడితో గొడవ పడి పంచాయితీ పెట్టించాడు. పలుమార్లు పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లాడు. అయినా మార్పు రాకపోవడంతో శుక్రవారం రాత్రి శ్రావణ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మూసేసి ఇంటికి వెళ్తుండగా, శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న తల్వార్ తో నరికి చంపాడు. అనంతరం రేగొండ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సంపత్ కుమార్, సీఐలు కరుణాకర్ రావు, దగ్గు మల్లేశ్ పరిశీలించారు.
న్యాయం చేయాలని ఆందోళన
శ్రావణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీకాంత్ తో పాటు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు.
