రాష్ట్రంలోని ఎప్ సెట్‌‌‌‌ ‘మాక్’ అలాట్‌‌‌‌మెంట్

రాష్ట్రంలోని ఎప్ సెట్‌‌‌‌ ‘మాక్’ అలాట్‌‌‌‌మెంట్
  •     79,313 మందికి సీట్ల కేటాయింపు
  •     5 నుంచి 7 వరకు ఆప్షన్ల మార్పు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎప్‌‌‌‌సెట్ కౌన్సెలింగ్‌‌‌‌లో భాగంగా ‘మాక్’ అలాట్‌‌‌‌మెంట్ ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. విద్యార్థులు https://tgeapcet.nic.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో తమ అలాట్‌‌‌‌మెంట్ వివరాలను చూసుకోవచ్చని సూచించారు. తాము ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం ఏ కాలేజీలో సీటు వచ్చే చాన్స్ ఉందో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఈ మాక్ అలాట్‌‌‌‌మెంట్ నిర్వహించినట్టు తెలిపారు. 

కంప్యూటర్ సైన్స్ కోర్సులకు జై 

కోర్సుల వారీగా చూస్తే.. కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులకే విద్యార్థులు జై కొట్టారు. సీఎస్ఈ, ఐటీ విభాగంలో 93 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఏఐ, కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 100 శాతం సీట్లు నిండాయి. ఎలక్ట్రానిక్స్  విభాగంలో 85 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్ అండ్ మెకానికల్‌‌‌‌లో 80 శాతం సీట్లు భర్తీ కాగా.. కెమికల్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ లాంటి ఇతర కోర్సుల్లో 82 శాతం సీట్లు నిండాయి. కాగా, మాక్ అలాట్‌‌‌‌మెంట్ అనేది కేవలం అవగాహన కోసం మాత్రమేనని అధికారులు ప్రకటించారు.  మాక్ అలాట్‌‌‌‌మెంట్ చూసుకున్న తర్వాత విద్యార్థులు తమ ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మాక్ అలాట్‌‌‌‌మెంట్‌‌‌‌లో వచ్చిన కాలేజీపై సంతృప్తిగా ఉంటే, ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. పాత ఆప్షన్లనే మొదటి విడత ఫైనల్ అలాట్‌‌‌‌మెంట్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌‌‌కు 89,785 మంది

ఈ ఏడాది కౌన్సెలింగ్‌‌‌‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌‌‌కు 89,785 మంది హాజరుకాగా, 88,062 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరంతా కలిసి మొత్తం 55,14,891 ఆప్షన్లను నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 88,053 సీట్లకు గాను.. మాక్ అలాట్‌‌‌‌మెంట్‌‌‌‌లో 79,313 సీట్లను కేటాయించారు. ఇంకా 8,740 సీట్లు ఖాళీగా ఉన్నాయి.రెండు ప్రైవేట్ వర్సిటీల్లోని 1,367 సీట్లు 100 శాతం భర్తీ అయ్యాయి.