రైతులకు ఊరట ..పడవ కష్టాలకు చెక్.. గణపసముద్రం చెరువుపై వంతెన.. మూడు జిల్లాలకు అనుసంధానం

రైతులకు ఊరట ..పడవ కష్టాలకు చెక్.. గణపసముద్రం చెరువుపై వంతెన.. మూడు జిల్లాలకు అనుసంధానం
  • పంట పొలాలకు వెళ్లేందుకు అడ్డంకిగా గణపసముద్రం బ్యాక్ వాటర్
  • రూ.42.69 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడప్ 
  • మూడు జిల్లాలకు అనుసంధానంగా వంతెన నిర్మాణం 

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న బుద్దారం గ్రామ రైతులకు నాలుగు దశాబ్దాలుగా గణపసముద్రం బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పడవల్లో దాటి పొలాలకు వెళ్లడం తప్పనిసరిగా మారింది. వృద్ధ రైతులు ప్రయాణం చేయలేక సాగును మానేయగా, మరికొందరు ప్రాణాలను పణంగా పెట్టి పడవల్లో ప్రయాణిస్తూ పంటలు సాగు చేస్తున్నారు. 

ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. వంతెన అందుబాటులోకి వస్తే రైతుల పడవ కష్టాలు తీరడంతో పాటు మూడు జిల్లాల మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. 

నాలుగు దశాబ్దాల నిరీక్షణ..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన సుమారు 400 మంది రైతులు 250 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అయితే గణపసముద్రం బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాటర్ అడ్డుగా ఉండటంతో రైతులు 40 ఏండ్లుగా పడవలపై ఆధారపడుతున్నారు. నలుగురు రైతులు కలిసి సుమారు రూ.50 వేలతో ఒక్కో పడవ కొనుగోలు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. 

ప్రస్తుతం గ్రామంలో దాదాపు 15 పడవలు ఉన్నాయి. ఎరువులు, వ్యవసాయ పరికరాలు, కూలీలను కూడా పడవల ద్వారానే పొలాలకు తరలిస్తున్నారు. రోజూ మూడు కిలోమీటర్ల మేర పడవ ప్రయాణం చేస్తూ భయం గుప్పిట్లోనే వ్యవసాయం చేస్తున్నారు. చెరువులో అలలు ఎగిసిపడిన సందర్భాల్లో పడవలు అదుపు తప్పి ప్రమాదాలు తప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, రైతులతో పాటు పశువులు కూడా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని  రైతులు చెబుతున్నారు.

 కాగా, బుద్దారం గ్రామం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వగ్రామం కావడంతో రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ప్రతి వారం పనులను స్వయంగా పరిశీలిస్తూ వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నారు.

రూ.42.69 కోట్లతో వంతెన నిర్మాణం..

గణపసముద్రం చెరువుపై వంతెన, అనుసంధాన రహదారుల నిర్మాణానికి మొత్తం రూ.42.69 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.17.69 కోట్లతో 1.4 కిలోమీటర్ల సీసీ రోడ్డు, 700 మీటర్ల బీటీ రోడ్డు, 2.2 కిలోమీటర్ల అనుసంధాన బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ శాఖ రూ.25 కోట్లతో చెరువుపై 50 మీటర్ల ప్రధాన వంతెన నిర్మిస్తోంది. పిల్లర్లు పూర్తికాగా ప్రస్తుతం స్లాబ్ పనులు కొనసాగుతున్నాయి. 

బ్రిడ్జి నుంచి రేగొండ మండలం భాగిర్థిపేట ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్ వరకు డబుల్ బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రెండు కల్వర్టుల పనులు కూడా కొనసాగుతున్నాయి. భాగిర్థిపేట ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్ నుంచి కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు రూ.50 కోట్లతో బీటీ రోడ్డు ఇప్పటికే పూర్తయింది.

మూడు జిల్లాలకు అనుసంధానం..

ఈ వంతెన అందుబాటులోకి వస్తే ములుగు, భూపాలపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మధ్య రాకపోకలు మరింత సులభమవుతాయి. భూపాలపల్లి, కరీంనగర్ ప్రాంతాల ప్రజలు ములుగు జిల్లాలోని మేడారం, రామప్ప వంటి పర్యాటక, పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు సుమారు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అలాగే ములుగు జిల్లా గ్రామాల ప్రజలు పరకాల, హనుమకొండ, కోటంచ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. కాగా, వంతెన నిర్మాణ పనులు ప్రస్తుతం 80 శాతం పూర్తయ్యాయి. రెండు వైపులా గ్రావెల్ పనులు పూర్తవగా రోలింగ్ కొనసాగుతోంది. కల్వర్టుల నిర్మాణం పూర్తికాగానే బీటీ రోడ్డు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాలు ఆటంకం కలిగించకపోతే ఈ ఏడాదిలోనే వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రగతికి బాటలు వేస్తున్నాం 

రెండున్నరేండ్లలో మారుమూల గ్రామాల రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు చేపట్టాం. బుద్దారం వంతెన పూర్తయితే రైతులతో పాటు మూడు జిల్లాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుంది. కోటంచకు వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభిస్తాం. రూ.23 కోట్లతో గిరిజన గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తున్నాం. గుడెప్పాడ్– చెల్పూర్ ఫోర్ లైన్ పనులు వర్షాల తర్వాత ప్రారంభిస్తాం. రూ.50 కోట్లతో భూపాలపల్లి పట్టణ సుందరీకరణ పనులు జరగనున్నాయి. బైపాస్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్​ సమస్యను తగ్గిస్తాం. అభివృద్ధిలో రాజీపడేది లేదు. 

- గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే భూపాలపల్లి-

వంతెనతో మా కష్టాలు తీరినట్లే..

గణపసముద్రం చెరువు దాటేందుకు నిర్మాణం చేస్తున్న వంతెనతో మా కష్టాలు దూరమైనట్లే. ఇప్పుడు పంట భూమి వద్దకు బైక్ మీద రాగలుగుతున్నాం. చెరువుదాటే క్రమంలో రెండేళ్ల కింద నా పశువులు చనిపోయాయి. నలుగురు రైతులు కలిసి ఉమ్మడిగా వెళ్లేందుకు పడవలు కొనుగోలు చేసుకుని చెరువు దాటుకుంటూ పొలాల వద్దకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ కష్టాలు తీరనున్నాయి.    

- మల్లేబోయిన రమేశ్, రైతు బుద్దారం-