సిద్దిపేట టౌన్, వెలుగు: తెలంగాణకు రేవంత్ రెడ్డి అనే గ్రహణం పట్టడం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. శనివారం సిద్దిపేటలో నిర్వహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. హైడ్రా చర్యలు, ప్రతికూల నిబంధనల వల్ల రియల్ ఎస్టేట్‌తో పాటు చిన్న వ్యాపారాలు, టీ హోటళ్లు, ఇతర అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.
గతంలో సిద్దిపేటలో బంగారం కంటే ప్లాట్ విలువ ఎక్కువగా ఉండేదని, అప్పట్లో కోటి రూపాయలు పలికిన భూమిని ఈరోజు అరవై లక్షలకైనా కొనేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగనాయక సాగర్ వద్ద పర్యాటక ప్రాజెక్టులు, ఇతర విద్యాసంస్థల పనులు మధ్యలోనే ఆగిపోయాయని ఆరోపించారు. మరో రెండేండ్లు ఓపిక పడితే మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు సిద్దిపేట అభివృద్ధిని వంద కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టిస్తామని తెలిపారు.
అనంతరం సిద్దిపేట ఫ్రెండ్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించారు. మెకానిక్‌ల సంఘానికి సొంతంగా ఇలాంటి భవనం ఉండటం చాలా అరుదైన విషయమని, ఆ గౌరవం సిద్దిపేట అసోసియేషన్‌కు దక్కడం గర్వకారణమన్నారు. మెకానిక్‌లందరికీ ఉచితంగా ఇన్షూరెన్స్ సౌకర్యం కల్పించేలా తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.
