- మరో ఏడు సంఘాల్లో 14 మంది మహిళా డైరెక్టర్లు ఏకగ్రీవం
- 29 సంఘాలకు ఎన్నికలు పలు సంఘాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్యానెళ్లు పోటీ
- 548 నామినేషన్లు.. నేడు పరిశీలన
- రేపు ఉపసంహరణ, తుది జాబితా, 10న ఎన్నికలు
యాదాద్రి, వెలుగు : చేనేత సహకార సంఘాల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 12 సంఘాలకు డైరెక్టర్లు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. మరో ఏడు సంఘాల్లో మహిళా డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పలు మండలాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున రెండు ప్యానెళ్లుగా డైరెక్టర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ప్యానెళ్లు కాకుండా మరికొందరు నామినేషన్లు దాఖలు చేశారు. యాదాద్రి జిల్లాలో చేనేత కార్మిక సంఘాలు 42 ఉన్నాయి.
వీటిల్లో ఆలేరులోని సిల్క్ సొసైటీ సభ్యత్వాల అంశంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ సంఘం మినహా మిగిలిన 41 సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. వీటిల్లో ఓటు హక్కు కలిగిన సభ్యులు 8,651 ఉన్నారు. ఒక్కో సంఘానికి 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో రెండు డైరెక్టర్ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ సంఘాల ఎన్నికలకు సంబంధించి శనివారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది.
12 సంఘాలు ఏకగ్రీవం
ఎన్నికలు జరుగుతున్న 41 సంఘాలకు జనరల్ కేటగిరిలో 532 మంది, మహళా రిజర్వేషన్ కేటగిరిలో 138 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 12 సంఘాలకు 9 మంది చొప్పునే నామినేషన్లు వేయడంతో ఆ సంఘాలకు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయినట్టయింది. మరో ఏడు సంఘాల్లోని మహిళలకు రిజర్వ్ చేసిన డైరెక్టర్ స్థానాల్లో రెండు చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో 14 మంది మహిళా డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. 29 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.
భారీగా నామినేషన్లు
జిల్లాలోని పలు మండలాల్లోని సంఘాలకు డైరెక్టర్ స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 9 డైరెక్టర్ స్థానాలకు సిరిపురంలో 33, ఎల్లంకిలో 29 నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరిలో 28, పోచంపల్లి, నారాయణపురంలో 27 చొప్పున నామినేషన్లు వేశారు. కుంట్లగూడెంలో 25, నేలపట్ల, మోత్కూరులో 24 చొప్పున, వెల్వర్తి, చౌటుప్పల్లో 23 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.
నేడు తుది జాబితా
ఆదివారం నామినేషన్ల స్క్రూటినీ, సోమవారం ఉపసంహరణ ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న డైరెక్ట్రర్ల తుది జాబితా రిలీజ్ చేయడంతో పాటు గుర్తుల కేటాయింపు ఉంటుంది. 10న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకూ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు.
