- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నల్గొండ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లు పూర్తై, జాతీయ డ్యాం భద్రతా సంస్థ, కేంద్ర జల సంఘం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయవిహార్‌లో శనివారం ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల కంటే ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల రక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.1.10 లక్షల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయిందని, ఆ ఆస్తిని కాపాడడం తమ బాధ్యత అని తెలిపారు. రిపేర్లు పూర్తి కాక ముందే నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని, భద్రాచలం పట్టణంతో పాటు దిగువన ఉన్న 40 గ్రామాల ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు.
బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో చేపడుతున్నామని, భూగర్భ సాంకేతిక పరీక్షలు, నాన్ -డిస్ట్రక్టివ్ టెస్టులు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు, డ్రోన్ సర్వేలు, వందకు పైగా బోర్ హోల్స్ ద్వారా నిర్మాణాల పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎన్ డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజీల అన్ని గేట్లను ఎత్తి ఉంచి, నీటి ఒత్తిడి లేకుండా చూస్తున్నామన్నారు.
కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ, కేంద్ర జల సంఘం, అంతర్జాతీయ నిపుణులు కలిసి పునరుద్ధరణ నమూనాలను పరిశీలిస్తున్నారని, భద్రతపై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం
నాగార్జునసాగర్ డ్యామ్ భద్రత, నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డ్యామ్ కు అవసరమైన రిపేర్ల అంచనాలను సిద్ధం చేసి పరిపాలన అనుమతులకు పంపాలని, లైనింగ్ అవసరమైన కాల్వలను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
పట్టణ ప్రాంతాల గుండా వెళ్లే ఓపెన్ కాల్వలను దశలవారీగా కప్పి వేసేందుకు ప్రపోజల్స్ సిద్ధం చేయాలని సూచించారు. అంతకుముందు మిర్యాలగూడలో మోడ్రన్ రైస్ మిల్లును ప్రారంభించారు. అనంతరం దున్నపోతులగండి, కేశవాపూర్, నెల్లికల్లు ఎత్తిపోతల పథకాల పనులను పరిశీలించి, పనులు స్పీడ్ గా పూర్తి చేయాలని ఆదేశించారు.
