ఫుడ్ సేఫ్టీ వెనుకబాటుకు ఇదే కారణమా..?

ఫుడ్ సేఫ్టీ వెనుకబాటుకు ఇదే కారణమా..?

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వ్యవస్థలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అత్యంత కీలకమైన అధికారి. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా చూడటం, ఆహార తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నిల్వ, రవాణా, నాణ్యతా ప్రమాణాలు, ఫుడ్ సేఫ్టీ చట్టాల అమలు వంటి అనేక సాంకేతిక అంశాలను పర్యవేక్షించడం ఈ అధికారి  ప్రధాన బాధ్యత. కాబట్టి ఇది కేవలం పరిపాలనా ఉద్యోగం కాదు,  అత్యున్నత  సాంకేతిక పరిజ్ఞానం అవసరమయ్యే  ప్రత్యేక పోస్టు.  

అయితే ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి ఆహార శాస్త్రానికి సంబంధించిన కోర్సులతోపాటు ఎంబీబీఎస్, వెటర్నరీ  సైన్స్,  డెంటల్ సైన్స్ వంటి అర్హతలు కూడా అనుమతించడం జరుగుతోంది. ఇక్కడ ఒక సహజమైన ప్రశ్న తలెత్తుతోంది. ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులు నాలుగేళ్లపాటు ఫుడ్ ప్రాసెసింగ్,  ఫుడ్  మైక్రోబయాలజీ,  ఫుడ్ కెమిస్ట్రీ,  ఫుడ్ ప్యాకేజింగ్, ఫుడ్ ఇంజినీరింగ్, హీట్ ట్రాన్స్‌‌‌‌ఫర్, మాస్ ట్రాన్స్‌‌‌‌ఫర్,  ఫుడ్ ప్లాంట్ డిజైన్, క్వాలిటీ అస్యూరెన్స్, హెచ్‌‌‌‌ఏసీసీపీ, ఎఫ్‌‌‌‌ఎస్ఎస్ఏఐ, పీఎఫ్‌‌‌‌ఏ  నిబంధనలు, ఫుడ్ సేఫ్టీ చట్టాలు వంటి అంశాలను ప్రత్యేకంగా అభ్యసిస్తారు. ఇవే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగంలో ప్రతిరోజూ అవసరమయ్యే సాంకేతిక అంశాలు. 

ప్రతి ప్రత్యేక ఉద్యోగానికి అవసరమైన విద్యా నేపథ్యం ముఖ్యం

ఎంబీబీఎస్, డెంటల్,  వెటర్నరీ కోర్సులు  సమాజానికి అత్యంత విలువైనవి. అయితే వాటి ప్రధాన ఉద్దేశ్యం వైద్యం, దంత వైద్యం లేదా పశువైద్యం.  ఫుడ్ ప్యాకేజింగ్,  ఫుడ్ ప్రాసెసింగ్,  హీట్ ట్రాన్స్‌‌‌‌ఫర్,  మాస్ ట్రాన్స్‌‌‌‌ఫర్, ఫుడ్ ఇంజినీరింగ్ వంటి అంశాలు వాటి ప్రధాన  సిలబస్‌‌‌‌లో ఉండవు.  ప్రతి కోర్సుకు తనదైన ప్రాముఖ్యత ఉన్నప్పటికీ,  ప్రతి ప్రత్యేక ఉద్యోగానికి అవసరమైన విద్యా నేపథ్యం కూడా అంతే ముఖ్యమైనది.  ఈ సందర్భంలో  మరో ప్రశ్న కూడా  ఉత్పన్నమవుతోంది. 

 ఫుడ్ టెక్నాలజీ  పట్టభద్రులుఎంబీబీఎస్, డెంటల్ లేదా వెటర్నరీ అధికారుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉండదు.  ఎందుకంటే  ఆ పోస్టులకు  ప్రత్యేక వైద్య విద్య అవసరం. అయితే అదే  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్  పోస్టుకు ఎందుకు వర్తించకూడదు?  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా ఒక ప్రత్యేక సాంకేతిక పోస్టు. అయితే, ఫుడ్ సైన్స్‌‌‌‌లో  ప్రత్యేక విద్యను అభ్యసించిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం సహజ న్యాయ సూత్రానికి అనుగుణంగా ఉండదా అనే అంశంపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది.

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల కొరత

నియామక  పరీక్ష విధానంలో  కూడా మార్పులు అవసరం.  ప్రస్తుత పరీక్షలో టెక్నికల్ సబ్జెక్టులు,  జనరల్ స్టడీస్‌‌‌‌కు దాదాపు  సమాన ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది.  కానీ, ఇది పూర్తిగా సాంకేతిక పోస్టు. కాబట్టి కనీసం 75 శాతం ప్రశ్నలు సంబంధిత సాంకేతిక సబ్జెక్టుల నుంచి, 25 శాతం ప్రశ్నలు మాత్రమే  జనరల్ సైన్స్ నుంచి ఉండాలి.  దీనివల్ల ఉద్యోగానికి అవసరమైన, నిజమైన సాంకేతిక సామర్థ్యాన్ని అంచనా వేయడం  సాధ్యమవుతుంది.

హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల కొరత, సాంకేతిక నైపుణ్యానికి తగిన ప్రాధాన్యం లేకపోవడం, నియామక విధానంలో లోపాలు వంటి అంశాలు కూడా దీనికి కారణాలుగా ఉన్నాయా అనే దానిపై ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాసం ఏ వృత్తిని లేదా అర్హతను తక్కువచేసి చెప్పడం కోసం కాదు.  ఎంబీబీఎస్, డెంటల్, వెటర్నరీ, ఫుడ్ టెక్నాలజీ, ప్రతి కోర్సు సమాజానికి ఎంతో విలువైనదే. 

సురక్షితమైన ఆహారం ప్రతి పౌరుని హక్కు

ప్రజల ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేసే ఫుడ్ సేఫ్టీ వంటి ప్రత్యేక సాంకేతిక విభాగాల్లో నియామక అర్హతలు,  పరీక్షా విధానం ప్రత్యేకంగా ఉండాలి.  అమలు వ్యవస్థ  ఉద్యోగ స్వభావానికి అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం, సంబంధిత  విధాన నిర్ణయాలు పునఃసమీక్షించడం అత్యవసరం.  గత నాలుగేళ్లుగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల నియామకాలు లేకపోవడం, అలాగే అందుబాటులో ఉన్న పోస్టుల్లో గణనీయమైన సంఖ్య ఖాళీగా ఉండటం ఫుడ్ సేఫ్టీ అమలు వ్యవస్థపై ప్రభావం చూపుతున్న అంశాలుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. 

 ప్రజారోగ్యానికి సంబంధించిన ఈ కీలక విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేసి వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరం. సురక్షితమైన ఆహారం ప్రతి పౌరుని హక్కు.  ఆ హక్కును కాపాడే  ఫుడ్ సేఫ్టీ వ్యవస్థలో  సాంకేతిక నైపుణ్యానికి తగిన ప్రాధాన్యం లభించినప్పుడే  ప్రజలకు మరింత సమర్థవంతమైన ఆహార భద్రత అందించగలం.


- సి.హెచ్.దినేష్
బి.టెక్ ఫుడ్ టెక్నాలజీ,
ఉస్మానియా యూనివర్సిటీ

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.