వెలుగు స్పెషల్: మచ్చర్‌‌ని మెచ్చుకున్నాం.. ప్లంబర్‌‌ని ప్రశంసించాం.. కానీ!

వెలుగు స్పెషల్: మచ్చర్‌‌ని మెచ్చుకున్నాం.. ప్లంబర్‌‌ని ప్రశంసించాం.. కానీ!

ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంతర్జాతీయ అంశం ఫ్లై దుబాయ్ ఫ్లయిట్ ఎపిసోడ్. కో-పైలెట్ చేసిన దాడిలో రక్తమోడుతున్నా 170 మందికి పైగా ప్రయాణికుల్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ తెగువను అందరూ ప్రశంసిస్తున్నారు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ సంఘటనలో ఒకపక్క ఆ విమానం సెకెండ్ల కాలంలోనే  33 వేల అడుగులకు పైగా ఎత్తు నుంచి ఒక్కసారిగా 16వేల అడుగులకు  పడిపోతూ మరింత కిందికి జారిపోయే అతి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

కెప్టెన్ స్మిత్ తానున్న విపత్కర స్థితిలోనే కాక్ పిట్ తలుపు తెరవగా, ఆ తర్వాత ఆలోచించడానికి కూడా సమయం లేని ఆ సంక్లిష్ట స్థితిలో యానివ్ హయూన్ అనే ఒక ప్రయాణీకుడు విమానం నడిపిన అనుభవం ఏమాత్రం లేకపోయినా ఒక టీవీ షో ద్వారా తాను తెలుసుకున్న పరిజ్ఞానంతో విమానాన్ని నియంత్రించాడు. ఈ క్రమంలో విమానంలోనే ఉన్న ఆఫ్ డ్యూటీ  పైలెట్లు రంగంలోకి దిగి ప్రమాదానికి గురికాకుండా పరిస్థితిని చక్కదిద్దారు. వారితోనే ఉన్న డెంటిస్ట్ అయిన ఇజ్రాయెల్ డాక్టర్ షోటా ఆ ఫ్లయిట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరిస్థితి మరింత దిగజారిపోకుండా వైద్యసేవలందించారు. 

ఈ ఘటనా క్రమంలోని కొన్ని పరిణామాలు నిమిషాలలోపే, ఇంకా చెప్పాలంటే సెకెండ్లలో చోటు చేసుకున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవడంలోనైనా కొద్ది సెకెండ్ల పాటు ఆలస్యం జరిగి ఉంటే, అక్కడేం జరిగి ఉండేదో  చెప్పాల్సిన పనిలేదు.  ఎన్నో టైం మేనేజ్​మెంట్ సెషన్స్,  పర్సనాలిటీ  డెవలప్‌‌మెంట్ క్లాసెస్ లేదా క్రిటికల్ థింకింగ్ వర్క్‌‌షాప్స్ ఇవ్వలేని జ్ఞానాన్ని, మానవత్వం-, ధైర్యసాహసాలతో కూడిన సామాజిక స్పృహను ఈ సంఘటన మనకు అందిస్తుంది.

ప్లంబర్​ జ్ణానం గొప్పది

ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే.. 'విమానం నడిపిన అనుభవం ఏమాత్రం లేని' ఆ ప్లంబర్ యానివ్ హయూన్, అత్యంత సంక్లిష్ట సమయంలో ఆ విమానం మరింత కిందికి పడిపోకుండా దాన్ని నియంత్రించి పైకి లేపాడు. ఈ పరిణామం ఈ మొత్తం ఎపిసోడ్‌‌కి ప్రాణం లాంటిది. తాను టీవీలో ఇష్టంగా చూసే ‘ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ షో’ ద్వారా ఫ్లయిట్ ఆపరేషన్ ఎలా జరుగుతుందనేది నిశితంగా గమనించి ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకున్నాడు, అది ఈ ఆపత్కాలంలో అందరినీ ఆదుకునేలా అతన్ని ప్రేరేపించింది. మనలోనూ చాలామంది ఆ ప్లంబర్‌‌లాగ ఎన్నో విషయాలను నిజ జీవితంలోను నేర్చుకుంటారు, నిష్ణాతులవుతుంటారు.  వ్యాపారులుగా,  పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి సంఘంలో పలుకుబడి పెంచుకుని  ఆర్థికంగానూ మంచి స్థితికి చేరుకుంటారు. అయితే, ఇలాంటివారిలో చాలామంది ఆపదలో ఉన్న సాటివారికి సాయం చేసే స్థితిలో ఉన్నప్పటికీ, అలా ముందుకు రాకపోవడం చూస్తుంటాం.

బాధితులను ఆదుకునే స్పూర్తి రావాలి

ఫ్లైదుబాయ్  విమాన ఘటనలో ప్రమాదాన్ని నివారించేందుకు ముందుకొచ్చినవారికి, మనలోని చాలామందికి ఉన్న పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, వారు అత్యంత ప్రాణాంతక పరిస్థితిలో సహకరించుకుని ఆపదను దాటారు. మనలో చాలామంది అలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎన్నో జీవితాలను బాగుచేసే అవకాశమున్నా ముందుకు రావడం లేదు. 140 కోట్లకు పైగా జనం ఉన్న ఈ సమాజంలో బాధితుల సంఖ్య తక్కువేం కాదు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులు విలవిలలాడుతుంటే, పక్కనుంచే పదుల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి గానీ సాయం చేసేందుకు చాలామంది ఆగరు. 

కాలేజీ ఫీజులు కట్టలేక చదువు మానేసే విద్యార్థుల సంఖ్య నేటికీ తక్కువేం కాదు. రోగాలబారిన పడి చికిత్సకు డబ్బులు పెట్టలేక ఎందరో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి బాధితుల్లో సామాన్యులు, పేదలు, పేదరికంతో భిక్షాటన చేస్తున్నవారున్నారు.  అందరికీ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలే సాయం చెయ్యాలంటే కుదరదు.   నేటి సమాజంలో సంపన్నుల సంఖ్య చాలానే పెరిగింది. సాయంచేసే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్లై విమాన ఘటన నుంచి స్ఫూర్తిని అందుకోవాలి.

- గుళ్ళపూడి శ్రీనివాసకుమార్, సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.