‘ఫెయిర్ ఫాక్స్’ చైర్మన్ ప్రేమ్ వత్సాకు సన్మానం

‘ఫెయిర్ ఫాక్స్’ చైర్మన్ ప్రేమ్ వత్సాకు సన్మానం
  •     ఆయన హెచ్​పీఎస్ ​పూర్వ విద్యార్థి
  •     హాజరైన మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఎంపీ విశ్వేశ్వర్​రెడ్డి

పద్మారావునగర్, వెలుగు: బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌‌పీఎస్) పూర్వ విద్యార్థి, ఫెయిర్‌‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ ప్రేమ్ వత్సాను శనివారం సత్కరించారు. 1965 బ్యాచ్‌‌కు చెందిన ఆయన పాఠశాలను సందర్శించిన సందర్భంగా యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. పాఠశాలలో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న నూతన జూనియర్ స్కూల్ బ్లాక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1969–72 మధ్య హెచ్‌‌పీఎస్ ప్రిన్సిపాల్‌‌గా సేవలందించిన ప్రేమ్ వత్సా తండ్రి, దివంగత ఎంసీ వత్సా గౌరవార్థం కొత్త భవనానికి ఆయన పేరు పెట్టారు. 

హెచ్‌‌పీఎస్ సొసైటీ అధ్యక్షుడు గుస్తి జె.నోరియా మాట్లాడుతూ.. ప్రేమ్ వత్సా ప్రయాణం సంస్థ అందించిన విలువలకు నిదర్శనమన్నారు. ప్రేమ్ వత్సా భావోద్వేగానికి గురవుతూ.. తండ్రి పేరిట జూనియర్ బ్లాక్ నిర్మించడం తమ కుటుంబానికి దక్కిన గౌరవమని, తన ఎదుగుదలకు హెచ్‌‌పీఎస్ నేర్పిన పాఠాలే పునాది అని పేర్కొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవగా.. స్కూల్​ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.