- ఈ-పంచాయతీ పోర్టల్‌లో సరికొత్త ఫీచర్లు
- పంటల నష్టం, ప్రజల ఇబ్బందులపై వివరాల నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామాల్లో సమస్యల పరిష్కారం, ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ–పంచాయతీ పోర్టల్‌లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామాల ఇండ్ల యాజమానుల ఫోన్ నంబర్ల అప్‌డేట్ ప్రక్రియతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వివరాలను సేకరిస్తోంది.
ముఖ్యంగా గ్రామాల్లో కోతుల బెడదపై సమగ్ర డేటాను సేకరించేందుకు ప్రభుత్వం సరికొత్త సర్వేను ప్రారంభించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం 'మంకీ మెనేస్ సర్వే'కు శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల లాగిన్‌లో 3 ముఖ్యమైన ప్రశ్నలతో కూడిన ఆన్‌లైన్ సర్వేను పోర్టల్‌లో చేర్చారు. ఈ–పంచాయతీలో కోతులు ఉన్నాయా..? కోతుల వల్ల పంట నష్టం జరుగుతోందా..? కోతులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయా? అనే మూడు ప్రశ్నలకు పంచాయతీ కార్యదర్శులు అవును, కాదు ఆప్షన్ల ద్వారా సమాధానాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇంటి యజమానుల మొబైల్ నంబర్ల అనుసంధానం..
రాష్ట్రంలోని 12,760 గ్రామాల పరిధిలోని ఇంటి యజమానుల మొబైల్ నంబర్లను పోర్టల్‌లో అప్‌డేట్ చేయనున్నారు. దీనివల్ల స్థానిక పన్నుల నోటీసులు, ప్రభుత్వ పథకాల లబ్ధి, ఇతర పంచాయతీ సేవలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఇంటి యజమానుల మొబైల్‌కు నేరుగా మెసేజ్ వెళ్తుంది. అంతేకాకుండా, గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు సంబంధించిన సమాచారం కోసం ‘రూరల్ అన్‌ఎంప్లాయిడ్ యూత్ డీటెయిల్స్ ఎంట్రీ’ అనే ఫీచర్‌ను పోర్టల్‌లో చేర్చారు.
ఇందులో యువతకు సంబంధించిన విద్యా అర్హతలు, నైపుణ్యాలతోపాటు మొత్తం 13 రకాల వివరాలను నమోదు చేసేలా డిజైన్ చేశారు. ఈ–పంచాయతీ పోర్టల్‌లో చేర్చిన ఈ సరికొత్త అంశాలపై పంచాయతీ కార్యదర్శులు తక్షణమే స్పందించి ఆయా వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
