- పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా మార్చాలి
- ప్రభుత్వ భూముల విలువ పెంచి, పెట్టుబడులు రాబట్టాలి
- ‘హిల్ట్’ పాలసీ క్లియరెన్స్‌ల కోసం రోడ్ షోలు నిర్వహించాలి
- గ్లోబల్ సమిట్ కోసం టూరిజం డీపీఆర్‌లు రెడీ చేయాలి
- ఆదాయ వనరుల సమీకరణ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల విలువను పెంచి వాటి ద్వారా గరిష్ట ఆర్థిక ప్రయోజనం పొందడంతో పాటు, పరిశ్రమలు, పర్యాటక రంగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
శనివారం సెక్రటేరియెట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజుతో కలిసి వనరుల సమీకరణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేవలం సంప్రదాయ పన్నులపైనే ఆధారపడకుండా వినూత్న మార్గాల్లో రాబడిని తెచ్చే ప్రాజెక్టులను తక్షణమే పట్టాలెక్కించాలన్నారు. ‘హిల్ట్’ పాలసీని పకడ్బందీగా అమలు చేయడం, రాబోయే గ్లోబల్ సమిట్ వేదికగా పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శాఖలన్నీ సమన్వయంతో కదలాలన్నారు.
అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా కోటలు
తెలంగాణలోని చారిత్రక సంపదను, అటవీ అందాలను శాశ్వత ఆదాయ వనరులుగా మార్చే సరికొత్త ప్రాజెక్టులకు సమీక్ష సమావేశంలో పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో ఉన్న పురాతన కోటలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు పీపీపీ మోడల్‌లో ఇప్పటికే 11 చారిత్రక కోటల అభివృద్ధికి బిడ్లు ఆహ్వానించినట్టు అధికారులు తెలిపారు. వన్యప్రాణి ప్రేమికులను ఆకట్టుకునేలా ‘టైగర్ టూరిజం’ ప్రాజెక్టును ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
ఇదే సమయంలో నిజాంసాగర్‌లోని చారిత్రాత్మక నిజాం గెస్ట్‌హౌస్‌ను ఆధునీకరించి పర్యాటక అవసరాలకు వినియోగించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించగా, అధికారులు సానుకూలంగా స్పందించారు. నయా ట్రెండ్‌కు అనుగుణంగా కారవాన్ పార్కుల ఏర్పాటుపై దృష్టి సారించాలని, ఇందుకోసం ఎంపిక చేసిన మూడు జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
ప్రాజెక్టుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి గడువులు నిర్దేశించుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వాణి ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఉన్నతాధికారులు శశాంక, కృష్ణ భాస్కర్, ఇలంబర్తి, నిఖిల్ చక్రవర్తి, లోకేశ్ కుమార్, కృష్ణ ఆదిత్య, సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
