హైదరాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్ సఫారీలో సందర్శకులకు పెద్దపులి కనిపించడం హర్షనీయమని, అదే సమయంలో సిబ్బందిపై బాధ్యత మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
టైగర్ రిజర్వ్ పరిధిలో రోజువారీ పెట్రోలింగ్ షెడ్యూల్‌ను పకడ్బందీగా రూపొందించి, క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. వన్యప్రాణుల రక్షణతో పాటు సఫారీ ప్రాంతాల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది వీలైన సమయంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించాలని సూచించారు.
