రష్యాలో ఉద్యోగం పేరుతో రూ.4.20 లక్షల మోసం

రష్యాలో ఉద్యోగం పేరుతో రూ.4.20 లక్షల మోసం

పంజాగుట్ట, వెలుగు: రష్యాలో ఉద్యోగం, వీసా ఇప్పిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా నమ్మించి, రూ.4.20 లక్షలు కాజేసిన ఘటనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌‌‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌‌‌‌ లోని నాగార్జుననగర్‌‌‌‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి హరిప్రసాద్‌‌‌‌.. ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో రష్యా ఉద్యోగ ప్రకటన చూసి, అందులోని వాట్సాప్ లింక్ ద్వారా నిందితులతో సంప్రదింపులు జరిపారు. రాజ్‌‌‌‌వీర్ కౌర్ అనే మహిళ చండీగఢ్‌‌‌‌లో ఆఫీస్ ఉందంటూ పరిచయం చేసుకుని, గతంలో వీసాలు పొందినవారి డాక్యుమెంట్లు పంపి నమ్మకం కలిగించింది.

అనంతరం హరిప్రసాద్, ఆయన స్నేహితుల నుంచి పాస్‌‌‌‌పోర్టులు తెప్పించుకుని వీసా, ప్రాసెసింగ్, విమాన టికెట్ల పేరుతో విడతల వారీగా రూ.4.20 లక్షలు వసూలు చేసింది. మాస్కో ఫ్లైట్ టికెట్లు, పీఎన్ఆర్ నంబర్లు పంపడంతో నిజమేనని నమ్మిన బాధితులు గత నెల 19న ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడకు పత్రాలు తెస్తానని చెప్పిన రాజ్‌‌‌‌వీర్ కౌర్ ఫోన్ కట్ చేసి, బాధితులను బ్లాక్ చేసింది. తాము సైబర్ మోసానికి గురయ్యామని గ్రహించిన బాధితులు నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ ద్వారా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.