ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ దగ్గర వందలాది మంది ప్రజలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ (TPF), తెలంగాణ ఓటర్ల హక్కుల ఫోరం (TVRF), జాతీయ ప్రజా ఉద్యమాల కూటమి (NAPM), స్టూడెంట్స్ ఇస్లామిక్ యూనియన్ (SIU), కాక్రోచ్ జనతా పార్టీ (CJP)లతో పాటు ఇతర పౌర సమాజ సంస్థలతో సహా పలు సంఘాలు సంయుక్తంగా ఈ నిరసనను నిర్వహించాయి. ఈ సభలో నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ పాల్గొని ప్రసంగించారు.
నిరసనకారులు మూడు కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు. ఎస్ఐఆర్‌ను రద్దు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ప్రధాన ఎన్నికల కమిషనర్ , ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు , పదవీకాలం చట్టం, 2023ను రద్దు చేయడం వంటి డిమాండ్ చేశారు .నిరసనకారులు ఎస్ఐఆర్‌ను రద్దు చేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదాలతో కూడిన బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు.
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ప్రచురించాల్సి ఉన్న క్రమంలో ఈ నిరసన చోటుచేసుకుంది. సవరణ ప్రక్రియలో పారదర్శకతపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అక్టోబర్ 10న ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని వారు తెలిపారు.
