మాతృభాష కంటి చూపు లాంటిది..పరభాష కళ్లజోడు వంటిది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మాతృభాష కంటి చూపు లాంటిది..పరభాష కళ్లజోడు వంటిది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్, వెలుగు: తెలుగు యూనివర్సిటీ కేవలం డిగ్రీలను ఇచ్చే కర్మాగారంలా కాకుండా తెలుగు భాష, సంస్కృతులకు ప్రేరణ కేంద్రంగా, తెలుగు జాతికి సాంస్కృతిక ధర్మపీఠంగా వర్ధిల్లాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ 2026 ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.

దీనికి చీఫ్ గెస్టుగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మాతృభాష కంటి చూపు లాంటిదైతే, పరభాష కళ్లజోడు లాంటిదని, కళ్లు ఉంటేనే చూపుకు అర్థం ఉంటుందని చెప్పారు. మన వేర్లను, మూలాలను మరచిపోకుండా భావితరాలకు మన సంస్కృతిని అందించాలని  సూచించారు. ప్రైమరీ విద్యలో తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.  

పురస్కార గ్రహీతలు వీరే 

వర్సిటీ వీసీ నిత్యానందరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో కృషి చేసిన 12 మందికి పురస్కారాలను వెంకయ్యనాయుడు అందజేశారు. ఒక్కో గ్రహీతకు రూ.30,116 నగదు ఇవ్వడంతోపాటు శాలువా, సత్కార పత్రంతో సన్మానించారు. కవితల కేటగిరీలో కొట్ల వెంకటేశ్వర రెడ్డి, విమర్శ కేటగిరీలో ఎన్. భక్తవత్సల రెడ్డి, చిత్రలేఖనంలో కూరెళ్ల శ్రీనివాస్, శిల్పంలో ఏఎస్ ప్రకాశ్, నృత్యంలో హెచ్. అనిత, సంగీతంలో దుడ్డు సీతారామయ్య, పత్రికారంగంలో వై. నాగేశ్వరరావు, నాటకరంగంలో సురభి వెంగమాంబ, జానపద కళారంగంలో తూర్పాటి సాలమ్మ, అవధానంలో ఎంవీ పట్వర్ధన్, ఉత్తమ రచయిత్రిగా కాత్యాయని విద్మహే, నవలలో కస్తూరి మురళీకృష్ణ మంది అవార్డులు అందుకున్నారు.