గాంధీ జయంతి రోజు (2–10–2026) ముంబయి శివాజీ స్వేచ్ఛా మైదానంలో సీజేపీ నిర్వహించిన ప్రొటెస్ట్ మలి చరిత్రలో ఒక మైలురాయి. అభిజిత్ దీప్కే నాయకత్వంలోని సీజేపీ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, అతను 13 కోట్ల ఓట్లను దొంగిలించి దేశద్రోహిగా మారాడని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం పర్మిషన్ నిరాకరించింది. అయితే సీజేపీ ‘జైళ్లు నింపు’ పిలుపునిచ్చింది.
వేలాదిమంది శివాజీ పార్కుకు రావడంతో అభిజిత్‌తోపాటు కొంతమందిని అదుపులోకి తీసుకుని విధిలేక వదిలేసి శివాజీ పార్కులో వేలాది మందిని చేరనిచ్చారు. ఇది చాలా పెద్ద విజయం. మొట్టమొదటిసారి 80 ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశంలో యువత ఇంత క్రియేటివ్‌గా, ఇంత పట్టుదలతో ప్రాణాలకు తెగించి ప్రజాస్వామ్య రక్షణకు ముందుకురావడం ఇదే మొదటిసారి.
అధికారంలో ఉన్నది చాలా ఆర్గనైజెడ్ శక్తులతో కూడుకున్న ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఒక ప్లాను ప్రకారమే తమ సిద్ధాంతరంగంలో ట్రైనింగ్ పొందిన జ్ఞానేశ్‌కుమార్‌ను సీఈసీగా పెట్టారు. ఇది కేవలం మోదీ, అమిత్ షాలు మాత్రమే చేసిన పనికాదు. దీనికి వెనుక మొత్తం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకత్వ శక్తులన్నీ పనికట్టుకుని తిరిగి ఓటమిలేని ఓటు వ్యవస్థను తయారుచేసేందుకు చేశారు.
ముందు ముస్లింలను టార్గెట్
ముందు బెంగాల్‌లో, కాశ్మీర్‌లో ఇతర దేశాల నుంచి ముస్లింలు చొరబడి ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని ప్రచారం చేశారు. వారిని ఓటరు లిస్టు నుంచి కుటుంబ చరిత్ర వెతికితీసి తొలగించాలని నిర్ణయించారు. వారికి 2002 నాటికి ఓటు ఉండదని భావించి జ్ఞానేశ్‌కుమార్ ఆ తేదీ నుంచి ఓటరు కుటుంబ చరిత్ర తీయాలని నిర్ణయించారు. కానీ, 2024లో ముఖ్యంగా రాహుల్ గాంధీ దెబ్బతో మైనారిటీకి పడిపోవడంతో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నాటికి ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ కూటమి ఓట్లను ఇదే ప్లానుతో తొలగించారు.
ఇక్కడి నుంచి హిందూ– ముస్లిం సమస్యను పక్కకుపెట్టి ప్రతిపక్ష ఓటర్లపై గురిపెట్టారు. దేశమంతటా కాంగ్రెస్ ఓట్లపై, బెంగాల్‌లో మమత ఓట్లపై గురిపెట్టి సర్‌ను అమలుచేయడం మొదలుపెట్టారు. ఇందులో మొన్నటివరకు హిందువులంతా ఒక్కటే అన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు హిందూ మతంతో సంబంధం లేకుండా పార్టీలవారీగా ఓట్లను లెక్కేసి ప్లాను వేసినట్టు కనబడుతోంది.
ఎమర్జెన్సీలో ఇలా జరగలేదు
1975 నాటి ఎమర్జెన్సీలో నిర్బంధం, జైలు, పత్రికలపై నిఘా ఉన్నాయి కానీ, ఇందిరా గాంధీకి వ్యతిరేకమైన ఓట్లను ఏరి ఓటరు లిస్టు నుంచి తొలగించలేదు. అలా అయితే 1977లో జనతా కూటమి గెలిచేది కాదు. ఆనాడు కూడా ప్రజాస్వామ్యానికి ఇంత ప్రమాదమైన ఎత్తుగడ ఇందిరా గాంధీ వెయ్యలేదు. ఆనాటి భూస్వాములు, దళితులను, ఆదివాసులను ఓట్లు ఉన్నా వెయ్యనియ్యకపోవడం అనే సమస్య ఉంది. కానీ, మొత్తం దేశంలో ప్రతిపక్ష ఓట్లను ప్లాను ద్వారా తొలగించడం జరగలేదు. ఇప్పుడు మరో పార్టీ గెలవకుండా చేసేపని జరగలేదు.
ఇది రష్యాలో పుతిన్ ఎత్తుగడలా కనిపిస్తుంది
రష్యాలో పుతిన్ అధికారంలోకి వచ్చాక తన పార్టీ తప్ప వేరే ఏ పార్టీ గెలవడం లేదు. అసలు ప్రతిపక్షాల ఓట్లను ఓటర్ల జాబితాలో ఉంచుతారో లేదో తెలువది. కానీ, ప్రతిపక్షం గెలిచి ఆయనను అధికారం నుంచి దింపే పరిస్థితి మాత్రం రావడం లేదు. అదే పద్ధతి ఇండియాలో వస్తే ఈ రాజ్యాంగం బతకడం అసాధ్యం. క్రమం క్రమంగా ఒక్క మనిషి, ఒక్క ఓటు, ఒక్క విలువ అమలులో ఉండవు. పురాతన కాలంనాటి వర్ణవ్యవస్థలో ఉండే ‘నాగరికులు’ అనే సూత్రం అమలులోకి వస్తుంది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో కేవలం మూడు కులాల వాళ్లనే నాగరికులు (సిటిజన్స్)గా గుర్తించారు.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే సిటిజనులుగా గుర్తించారు. అదేస్థితి ఆధునిక కాలంలో తీసుకురావాలని ప్లాన్ చేశారా? లేకపోతే 13 కోట్ల మంది ఓట్లు ఇప్పటికే తీసేస్తే ఆ 13కోట్లు జాతీయ స్థాయిలో పార్టీల అధికార స్థితిని నిర్ణయిస్తాయి. ఫామ్ 6 ద్వారా చైతన్యవంతమైన యువకులు ఓటర్లు కాకుండా చూడాలని ప్లాన్ చేశారు. ఇది ఎంతో ప్రమాదం.
సీజేపీ ఇక్కడే రక్షణ కవచమైంది
ఈ స్థితిలో సీజేపీ కనుక యువశక్తితో ముందుకు రాకుండా ఉన్నట్లయితే ఇంత పెద్ద యువ కదలిక ఉద్యమం అక్టోబర్ 2న జరిగేది కాదు. రాజకీయ పార్టీలు సీజేపీతో జతకట్టాల్సిన అవసరాన్ని ఈ యువకులు కల్పించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో సీపీఐ(ఎం), ఆప్ సీజేపీ నాయకత్వంలో రంగంలోకి దిగాల్సిన పరిస్థితి చాలా హోప్‌ను కలిపిస్తుంది. యువకులైన సీజేపీ నాయకులు చాలా తెలివిగా వ్యవహరించారు. గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఈ దేశ ప్రజాస్వామ్య పునాది అని ప్రకటించారు. ఈ ముగ్గురి సిద్ధాంత వెలుగులో భిన్నత్వాన్ని తాత్విక ఏకత్వంలోకి నెట్టే కృషి ఈ యువ నాయకత్వం చేసింది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ఇరుసులాంటిది ఎన్నికల కమిషన్
గాంధీ, అంబేద్కర్, నెహ్రూ సిద్ధాంత నమ్మకాల్లో తేడాలు, భిన్నత్వాలు ఉన్నాయి. కానీ ఒక బలమైన రాజ్యాంగం రాసి, ప్రజాస్వామ్యాన్ని 80 ఏండ్లు నిలబెట్టిన తాత్విక శక్తి ఆ ఏకత్వానికి ఉన్నది. ప్రజాస్వామిక వ్యవస్థ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి ద్వారా మాత్రమే బతుకుతుంది. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ఇరుసులాంటిది. అది కూలిపోయి ఏకపక్షమైతే జ్యుడీషియరీ కూడా కూలిపోతుంది.
ఒకప్పుడు ఎమర్జెన్సీ స్థితిని మార్చి మళ్లీ వ్యవస్థ ఎన్నికల రంగంలో నిలబెట్టింది ఆనాటి స్వతంత్ర ఎన్నికల కమిషన్. ఆనాడు ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్‌కుమార్‌లాగ వ్యవహరిస్తే అసలు జనతా పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు. ప్రతి ప్రధాని, లేదా పార్టీ తామే నిరంతరం అధికారంలో ఉండాలని కోరుకోవచ్చు. కానీ స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల మార్పుకు నాంది వేస్తుంది.
ఈ ప్రమాదం ఎమర్జెన్సీ కంటే పెద్దది
ఇప్పుడున్న ప్రమాదం ఎమర్జెన్సీ కంటే ఎన్నోరెట్లు పెద్దది. రాజకీయ పార్టీలన్నింటిని చితకగొట్టే పని బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ ఇప్పటికే చేశాయి. ఎమర్జెన్సీలో అలాకాక ప్రతిపక్ష పార్టీలన్నీ రాజకీయ జైల్లో ఏకమయ్యాయి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులందరూ కరప్ట్ అని నేరస్థులుగా జైల్లో పెట్టడం వల్ల దానికి రాజకీయ శక్తి లేకుండా పోతుంది. కేజ్రీవాల్ స్థితి అదే. ఈ స్థితిలో అధికారంలో లేని యువత సీజేపీ రూపంలో రాకపోతే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడేది.
రాహుల్ గాంధీ పోరాడుతున్నా ఆయన మీద ప్రతిరోజు కేసులు పెట్టిస్తున్నారు. వారసత్వం ముద్రవేసి దాడి చేస్తున్నారు. కానీ అభిజిత్, అశుతోష్, దాస్ లాంటి యువకులు ముందుకు రాకపోతే దేశానికి దిక్కులేని పరిస్థితి వచ్చేది. వీరితోపాటు వేలాది మంది యువకులు భవిష్యత్తుపై భయం లేకుండా పోరాటాల్లోకి వస్తున్నారు. ఎంతో విజ్ఞతతో, శాంతియుతంగా దేశాన్ని మొత్తం కదిలిస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు.
ఈ ముగ్గురు యువ నాయకులు మీడియాతో భయంలేకుండా, బెణకకుండా సిద్ధాంత, నిజాల పట్టుతో మాట్లాడుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇది ఈ దేశ విద్యావ్యవస్థ సృష్టించిన ఆస్తి. దాన్ని నాశనం చేయాలనేది కూడా బీజేపీ ఆలోచన. ఈ స్థితిలో దేశం మొత్తం మతం మత్తులోకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
