- డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రారంభించిన రాహుల్
- ఒకే మ్యాప్‌లోకి దేశవ్యాప్త సమస్యలు, ఉద్యమాలు
- న్యాయం కోసం పోరాడే వాళ్లు నమోదు చేసుకోండి
- అణచివేతకు గురవుతున్న వారికి రాహుల్ భరోసా
- అణచివేతకు గురవుతున్న వారికి అండగా ఉంటానన్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై జరుగుతున్న పోరాటాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం ‘సత్యాగ్రహ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. మహాత్మా గాంధీ 157వ జయంతి తర్వాతి రోజు ఈ వేదికను ప్రారంభించారు. దేశంలో సత్యం అణచివేతకు గురవుతున్న చోట ప్రజలకు అండగా ఉండటం తన బాధ్యతని రాహుల్ అన్నారు. ప్రజలు తమ పోరాటం, సమస్య వివరాలను ‘సత్యాగ్రహ’ వెబ్సైట్లో కేవలం రెండు నిమిషాల్లో నమోదు చేసుకోవచ్చన్నారు. జెన్-జీ, విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పారు. భూమి, మహిళల హక్కులు, దళిత, బీసీ హక్కులు, విద్య, పరీక్షలు తదితర అంశాలపై జరుగుతున్న ఉద్యమాలను ఒకే మ్యాప్‌లోకి తీసుకొచ్చి, వాటికి అవసరమైన మద్దతు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
గాంధీజీ చెప్పినట్టు నిజమే గొప్ప ఆయుధమని, అయితే నిజం కోసం కలిసి నిలబడటం మరింత గొప్ప ఆయుధమని పేర్కొన్నారు. పార్లమెంట్లో, రోడ్లపై, లేఖల ద్వారా అవసరమైన చోట అండగా ఉంటానన్నారు. వివిధ పోరాటాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ‘సత్యాగ్రహ’ లక్ష్యమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. శుక్రవారం సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిలో కనీసం 700 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించినా.. ప్రభుత్వం ప్రజలు, విద్యార్థులు, కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేస్తోందని ఆరోపించారు. ఈ చర్యలకు ఎవరూ భయపడరని, నిరసనలు కొనసాగుతాయని అన్నారు. అన్నిచోట్ల, అన్ని వర్గాల పోరాటాల గొంతులను ఏకం చేయడమే రాహుల్ లక్ష్యమని, ప్రజలు, సంస్థలు లేవనెత్తే ప్రతి గొంతుకు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు.
