మహిళల అభివృద్ధికి ఏఐని వినియోగించాలి.. ఐలమ్మ మహిళా వర్సిటీలో జాతీయ సదస్సు

మహిళల అభివృద్ధికి ఏఐని వినియోగించాలి.. ఐలమ్మ మహిళా వర్సిటీలో జాతీయ సదస్సు
  • తెలంగాణ కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌‌ దేవసేన

హైదరాబాద్ సిటీ/కోఠి. వెలుగు: వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీలో వుమెన్ ఇన్ ద ఏఐ ఎర–ఎంపవరింగ్ ఫ్యూచర్ లీడర్స్ అనే అంశంపై శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్స్, మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌‌ దేవసేన మాట్లాడుతూ.. మానవ మేధస్సు ఏఐ ప్రత్యామ్నాయం కాదన్నారు. మహిళల అభివృద్ధికి ఏఐని వినియోగించాలని, అదే సాంకేతికత మహిళలపై హింస, వేధింపులకు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

మరో అతిథి అలహాబాద్‌‌ సెంట్రల్‌‌యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌‌ సంగీత శ్రీవాత్సవ మాట్లాడుతూ.. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, విద్య, ఉపాధితోపాటు జీవితంలోని కీలక నిర్ణయాల్లో స్వతంత్రత ఉండాలన్నారు. ఐలమ్మ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సూర్య ధనంజయ మాట్లాడుతూ.. మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక సెషన్లలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత ఐలమ్మ, బీసీ సెల్‌‌ డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ బంగారి శైలజ, హైదరాబాద్ సెంట్రల్​యూనివర్సిటీ ప్రొఫెసర్ రాములు ప్రసంగించారు. అనంతరం కాలేజీ హ్యాండ్‌‌బుక్, సెంటినరీ అలుమ్ని మ్యాగజైన్‌‌ను ఆవిష్కరించి, విశ్వవిద్యాలయ పరిశోధనలు, పేటెంట్లు, ప్రాజెక్టుల రంగాల్లో ప్రతిభ కనబరిచిన అధ్యాపకులకు 2026 పరిశోధనా పురస్కారాలను అందజేశారు.