నీటిని వృథా చేయొద్దు..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ముప్పు పొంచి ఉంది: కిషన్ రెడ్డి

నీటిని వృథా చేయొద్దు..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ముప్పు పొంచి ఉంది: కిషన్ రెడ్డి
  • ఎల్ నినోతో పెద్ద విపత్తు ఎదుర్కోవాల్సి 
  • రావచ్చన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • దిశ సమావేశంలో తాగునీటిపై చర్చ
  • సింగూరు, మంజీరాల్లో 80 రోజులకే 
  • నిల్వలు ఉన్నాయన్న అధికారులు
  • వేసవిలో బోర్లు పూర్తిగా ఎండిపోయే చాన్స్
  • నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన 
  • కల్పించాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌కు జలగండం పొంచి ఉందని, ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా దిశా కమిటీ చైర్మన్ జి. కిషన్‌‌‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తార్నాకలోని సీఎస్‌‌‌‌ఐఆర్-ఐఐసీటీ ప్రాంగణంలో ఆయన అధ్యక్షతన ‘దిశా’ సమావేశం జరిగింది. ఎల్‌‌‌‌నినో ప్రభావంతో సింగూరు, మంజీరా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 80 రోజులకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని జలమండలి అధికారులు తెలిపారు. వర్షాలు లేక ఈ రెండు ప్రాజెక్టుల్లోకి ఒక్క చుక్క కూడా కొత్త నీరు చేరడం లేదని చెప్పారు. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు డిసెంబర్ వరకు సరిపోవచ్చని, ఆ తర్వాత ఉస్మాన్‌‌‌‌సాగర్, గోదావరి, కృష్ణా, హిమాయత్‌‌‌‌సాగర్ నుంచి నగరానికి నీటిని తరలించే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.

ఈసారి బోర్లు పూర్తిగా ఎండిపోవచ్చు

 ప్రస్తుతం భూగర్భ జలాలు 50శాతం కూడా లేవని, ఈసారి వేసవిలో బోర్లు పూర్తిగా ఎండిపోయే ముప్పు ఉందన్నారు. ఎల్‌‌‌‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో పెద్ద విపత్తును ఎదుర్కొనే పరిస్థితి రావచ్చని  కిషన్​రెడ్డి చెప్పారు. విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిందని, కోల్ డిమాండ్ 30శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. ఈ సమస్యను ప్రజలకు అర్థమయ్యేలా ఆల్‌‌‌‌పార్టీ మీటింగ్ పెట్టాలని, ఎలక్ట్రిసిటీ, వాటర్ ప్రాబ్లం ఎలా ఉండబోతుందో అందరికీ తెలిసేలా చేయాలన్నారు. జీహెచ్‌‌‌‌ఎంసీ, కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రత్యేక డ్రైవ్‌‌‌‌లు చేపట్టి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గేటెడ్ కమ్యూనిటీల్లో వాడిన తర్వాత వృథాగా పోయే నీటిని రీసైకిల్ చేసి పార్కులు, ఇతర అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, జలమండలి, కేంద్ర, రాష్ట్ర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధికి ప్రత్యేక నిధులు

హైదరాబాద్‌‌‌‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కిషన్‌‌‌‌రెడ్డి చెప్పారు. శిథిలావస్థకు చేరిన ఫతేనగర్-సనత్‌‌‌‌నగర్ వంతెన విస్తరణ లేదా పునర్నిర్మాణానికి సీఎంకు లేఖ రాస్తానన్నారు. రాణిగంజ్ రోడ్డు బాక్స్ వెంట్స్, రహదారి విస్తరణపై రైల్వే డీఆర్ఎం, జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులతో ఇన్‌‌‌‌స్పెక్షన్ నిర్వహించనున్నారు. ఫిలింనగర్ రాక్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలపై విచారణకు మంత్రి ఆదేశించారు. కాలుష్య నివారణకు బోలక్‌‌‌‌పూర్‌‌‌‌లోని లెదర్ ప్రాసెసింగ్, స్క్రాప్ పరిశ్రమలను ఓఆర్‌‌‌‌ఆర్ అవతలికి తరలించాలన్నారు. జవహర్‌‌‌‌నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించేందుకు నగరానికి నలువైపులా ఈకో ఫ్రెండ్లీ వేస్ట్ ప్లాంట్లను వేగవంతం చేయాలని, 39 సీవేజ్ ట్రీట్‌‌‌‌మెంట్ ప్లాంట్ల పనులను సమీక్షించాలని సూచించారు.