స్కిల్ సెంట్రిక్‌‌‌‌ సిలబస్ రావాలి..విద్యార్థులకు డిగ్రీ ఉంటే చాలదు: మంత్రి శ్రీధర్ బాబు

స్కిల్ సెంట్రిక్‌‌‌‌ సిలబస్ రావాలి..విద్యార్థులకు డిగ్రీ ఉంటే చాలదు: మంత్రి శ్రీధర్ బాబు
  •      సర్టిఫికెట్ ఉంటే చాలదు.. పరిశ్రమలకు తగ్గ నైపుణ్యాలుండాలి
  •     ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమని వ్యాఖ్య​
  •     జేఎన్‌‌‌‌టీయూహెచ్‌‌‌‌లో ‘రీచ్-–2026’ కాంక్లేవ్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: విద్యావిధానంలో ఉద్యోగావకాశాలు కల్పించే స్కిల్ సెంట్రిక్ సిలబస్‌‌‌‌ను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విద్యార్థికి కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని, మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు, పరిశ్రమల అనుభవం ఉన్నప్పుడే ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. శనివారం జేఎన్‌‌‌‌టీయూహెచ్‌‌‌‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్‌‌‌‌మెంట్ కాంక్లేవ్ (రీచ్–2026) సదస్సును కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)లకు ప్రధాన హబ్‌‌‌‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రైవేట్ రంగాలు, పారిశ్రామిక వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా తెలంగాణ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నాణ్యమైన విద్యను అందించడమే ఈ కాంక్లేవ్ ముఖ్య ఉద్దేశమన్నారు. సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్, వికసిత్ భారత్‌‌‌‌లో పరిశ్రమల పాత్రను వివరించారు. అనంతరం ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి రచించిన ‘హైదరాబాద్ ఏ హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ కల్చరల్ హెరిటేజ్’ అనే పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓయూ వీసీ కుమార్ మొలుగురం, జేఎన్‌‌‌‌టీయూహెచ్ వీసీ టి.కిషన్ కుమార్ రెడ్డి, టీజీసీహెచ్‌‌‌‌ఈ వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ 
తదితరులు పాల్గొన్నారు.


మూడు ప్యానెల్స్‌‌‌‌లో  విస్తృత చర్చ..


కాంక్లేవ్‌‌‌‌లో భాగంగా ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలపై నిపుణులతో మూడు ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించారు. గ్లోబల్ పోటీకి తగ్గట్లుగా ఉన్నత విద్య అంశంపై చర్చలో వర్సిటీల్లో ఫ్యాకల్టీ కొరతను అధిగమించడం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ప్రైవేట్ సంస్థలతో చేతులు కలపడం, ల్యాబ్‌‌‌‌లు, క్రెడిట్ బదిలీని పరస్పరం పంచుకోవడంపై చర్చించారు. పరిశోధనలు–నూతన ఆవిష్కరణలు అంశంపై జాతీయ పరిశోధనా సంస్థల్లోని అత్యాధునిక పరికరాలు, ల్యాబ్‌‌‌‌లను రాష్ట్ర వర్సిటీల విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులోకి తీసుకురావడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ సదస్సులో వచ్చిన కీలక సూచనలను డిసెంబర్‌‌‌‌లో ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ పాలసీ రూపకల్పనకు ఇన్‌‌‌‌పుట్స్‌‌‌‌గా తీసుకోనున్నట్లు ప్రకటించారు.