- త్వరలో ఆపరేషన్ బ్లూ కోడ్ పేరుతో ఆస్పత్రులను సందర్శిస్తాం
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి అధ్వానంగా మారిందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎస్ఎన్ సీయూలో సీలింగ్ కూలిన ఘటనపై శనివారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాద ఘటన మరువకముందే భూపాలపల్లిలో సీలింగ్ కూలడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత పేర్కొన్నారు.
అదృష్టవశాత్తూ ఆ సమయంలో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే పసికందులు బలయ్యేవారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో సర్కార్ దవాఖానాలకు వెళ్తే ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేని దుస్థితి నెలకొందని విమర్శించారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం.. మీ చేతగానితనం వల్లే ఆస్పత్రులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని దుయ్యబట్టారు.
ఆస్పత్రుల్లో పారిశుధ్య లోపం, మందులు లేకపోవడం, బెడ్లు కొరతతో వీల్ చైర్లలో చికిత్స అందించే దౌర్భాగ్య స్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలోనే 'ఆపరేషన్ బ్లూ కోడ్' పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శిస్తామని వెల్లడించారు.
