వెలుగు స్పెషల్ : నో ఐడీ.. నో ఆల్కహాల్.. మద్యం నియంత్రణకు దుబాయ్ రేషనింగ్ నమూనా

వెలుగు స్పెషల్ : నో ఐడీ.. నో ఆల్కహాల్.. మద్యం నియంత్రణకు దుబాయ్ రేషనింగ్ నమూనా

మద్యపాన నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్‌‌‌‌‌‌‌‌  వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళిత, గిరిజన, బలహీన వర్గాల కుటుంబాలు మద్యం మహమ్మారి వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సర్వనాశనమవుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి కఠిన నిర్ణయం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

మద్యం ఆదాయ ప్రస్థానం (2014-2026) పరిశీలిస్తే... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన 2014 నాటి నుంచి నేటివరకు ప్రభుత్వం సంపాదించే స్వయం ఉపాధి ఆదాయ వనరులలో మద్యం ఎక్సైజ్ సుంకాలు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి  ప్రతి ఏటా స్థిరమైన వృద్ధితో  దూసుకుపోతూ ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో 44,557 కోట్ల రూపాయలతో చరిత్రలోనే గరిష్ట రికార్డును  నమోదు చేసింది.  గత 12 ఏళ్లలో  రాబడి  దాదాపు నాలుగు రెట్లు పెరిగింది.

మద్యంపై ఎక్సైజ్ సుంకం అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం.  భారత రాజ్యాంగంలోని  ఏడవ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 51  ప్రకారం, మానవ వినియోగానికి ఉపయోగించే మద్యం ఉత్పత్తి, తయారీ, రవాణా, కొనుగోలు, అమ్మకాలపై  పన్నులు విధించే, చట్టాలు చేసే సంపూర్ణ అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది.  తెలంగాణలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుచేయడం ఆర్థికంగా, ఆచరణాత్మకంగా చాలా క్లిష్టమైన వ్యవహారం.  రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడిలో దాదాపు 25% నుంచి 30% వరకు వాటా కేవలం మద్యం అమ్మకాల ద్వారానే లభిస్తోంది.  

ఒకవేళ మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తే ప్రతి ఏటా లభించే సుమారు రూ. 44,000 కోట్ల  భారీ ఆదాయాన్ని  ప్రభుత్వం  కోల్పోవాల్సి వస్తుంది.  గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ప్రయోగాలు, ప్రస్తుత పొరుగు రాష్ట్రాల పరిస్థితులు ఈ నిషేధ వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్,  కర్నాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మద్యం అక్రమ రవాణా (స్మగ్లింగ్) సాగిస్తూ అక్రమ మార్కెట్ వేగంగా విస్తరించే అవకాశం ఉంది. 

దెబ్బతింటున్న ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం

మద్యం వినియోగపరంగా భారతదేశంలోనే  తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోందనేది చేదు నిజం.   ప్రపంచ ఆరోగ్య సంస్థ  నివేదికలు,  జాతీయ  సర్వేల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఒక వ్యక్తి  సగటున ఏడాదికి 4.44 లీటర్ల మద్యాన్ని సేవిస్తున్నారు. ఈ మితిమీరిన అలవాటు ప్రజల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా, ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు,  యువతను అల్పాయుష్కులుగా మారుస్తున్నాయి.  దీనికితోడు, ఈ మితిమీరిన తాగుడు సమాజంలో నేరాల రేటు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది.

గృహహింస, మహిళలపై  వేధింపులు, రోడ్డు ప్రమాదాలు, క్షణికావేశంలో జరిగే ఘర్షణలు, ఇలా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులలో అత్యధిక శాతం మద్యం మత్తులో జరిగినవే ఉంటున్నాయి. మద్యం వినియోగం సృష్టిస్తున్న సామాజిక విధ్వంసంలో  పేదల కుటుంబాలు అత్యంత భారమైన ఆర్థిక మూల్యాన్ని చెల్లిస్తున్నాయి. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ వర్గాలలో రోజువారీ కూలీలు, చిన్నకారు రైతులు,  శ్రామికులు ఎక్కువగా ఉంటారు.  రెక్కాడితేగానీ డొక్కాడని ఈ వర్గాల పురుషులు రోజంతా కష్టపడి సంపాదించే రోజువారీ ఆదాయంలో 40% నుంచి 50% వరకు సాయంత్రానికి వైన్ షాపుల  ఖజానాకు చేరుతోంది. దీనివల్ల సంపాదన అంతా మద్యానికే ఖర్చుచేయడంతో కనీస అవసరాలు కూడా తీరని దుస్థితి ఏర్పడుతోంది. 

దుబాయ్ మోడల్...ఆధార్ ఆధారిత రేషనింగ్ విధానం 

తెలంగాణలో  సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించడం వల్ల తీవ్రమైన ఆర్థిక లోటు,  పరిపాలనాపరమైన సవాళ్లు ఎదురవుతాయి. దీనిని అధిగమించడానికి అంతర్జాతీయంగా విజయవంతమైన 'దుబాయ్ లిక్కర్ లైసెన్సింగ్ విధానం' స్ఫూర్తితో  ఒక డిజిటల్  పర్యవేక్షణ  రేషనింగ్ నమూనాను  రాష్ట్రంలో ప్రవేశపెట్టవచ్చు.  నిర్బంధ  గుర్తింపు ధృవీకరణ నమూనా ప్రకారం రాష్ట్రంలోని అన్ని వైన్‌‌‌‌‌‌‌‌షాపులు, బార్లు, క్లబ్బులలో విధిగా వినియోగదారుని ఆధార్ కార్డ్  లేదా ప్రభుత్వం గుర్తించిన అధికారిక ఐడీని బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించిన తర్వాతే మద్యం సీసాను విక్రయించడానికి అనుమతి ఇవ్వాలి.  

వ్యక్తిగత కోటా కేటాయింపు విధానం ప్రకారం ఒక వ్యక్తి నెలకు గరిష్టంగా ఎంత పరిమాణంలో (లీటర్లలో) మద్యం కొనుగోలు చేయవచ్చో చట్టబద్ధమైన గరిష్ట పరిమితిని విధించాలి. ఒక కొనుగోలుదారుడు తనకు కేటాయించిన నెలవారీ కోటాను పూర్తి చేసిన వెంటనే, కేంద్రీకృత సర్వర్ వ్యవస్థ అతని ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ను లాక్ చేస్తుంది. తదుపరి క్యాలెండర్ నెల ప్రారంభమయ్యే వరకు రాష్ట్రంలోని ఏ విక్రయ కేంద్రంలోనూ అతనికి మద్యం లభించకూడదు. 

 ఆధార్ ఆధారిత పర్యవేక్షణతో రాష్ట్రంలోని అన్ని రిటైల్ విక్రయ కేంద్రాలు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ( టీఎస్‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌), అబ్కారీ శాఖ సంయుక్తంగా నిర్వహించే కేంద్రీకృత సర్వర్‌‌‌‌‌‌‌‌కు అనుసంధానించాలి.  ప్రతి లావాదేవీ జరిగినప్పుడు కొనుగోలుదారుని ఎన్‌‌‌‌‌‌‌‌క్రిప్ట్ చేసిన ప్రత్యేక ఐడీ, కొనుగోలు చేసిన సమయం, ప్రాంతం, మద్యం పరిమాణం వంటి వివరాలు రియల్-టైమ్‌‌‌‌‌‌‌‌లో  రికార్డ్ అవ్వాలి.  ఈ  రియల్-టైమ్ ఆడిట్ విధానం వల్ల ఒకే వ్యక్తి కొనుగోలు పరిమితులను దాటి వివిధ షాపులు తిరుగుతూ మద్యం సేకరించే వీలుండదు. 

మిలిటరీ నమూనా    

మద్యం వినియోగాన్ని కట్టడి చేయడానికి మిలిటరీ క్యాంటీన్ల (సీఎస్‌‌‌‌‌‌‌‌డీ) విధానం మరొక అత్యంత క్రమశిక్షణతో కూడిన పటిష్టమైన నమూనాగా నిలుస్తుంది. ఈ విధానంలో బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ మద్యం దుకాణాలకు పూర్తిగా స్వస్తి పలికి,  కేవలం ప్రభుత్వ నియంత్రణలో ఉండే  ప్రత్యేక క్యాంటీన్ల ద్వారానే పంపిణీ జరుగుతుంది. దీని ప్రకారం అర్హులైన ప్రతి వినియోగదారునికి ఒక ప్రత్యేక స్మార్ట్ కార్డ్  జారీ చేసి,  కుటుంబ, సామాజిక, -ఆర్థిక స్థితిని బట్టి  నెలవారీ కోటాను (ఉదాహరణకు నెలకు ఇన్ని సీసాలు మాత్రమే) కచ్చితంగా పరిమితం చేయవచ్చు. 

నియంత్రణ సాధ్యమే

మద్యం నియంత్రణకు సంబంధించి దుబాయ్ నమూనా లేదా మిలిటరీ నమూనాను  స్వతంత్రంగా అమలుచేసే సంపూర్ణ చట్టపరమైన హక్కు తెలంగాణ ప్రభుత్వానికి  ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో నూతన చట్టాన్ని లేదా ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టవచ్చు.  లైసెన్సింగ్ విధానాన్ని మార్చడం,  వ్యక్తిగత  కోటాలను నిర్ణయించడం,  విక్రయ కేంద్రాలను ప్రభుత్వ క్యాంటీన్లుగా మార్చడం వంటి కీలక నిర్ణయాలన్నీ పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే సాధ్యమవుతాయి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత చట్టాలకు లోబడి, రాష్ట్ర సాంకేతిక సంస్థ  ప్రత్యేక  సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  రూపొందించవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నియంత్రణ పాలసీని తీసుకురావచ్చు.

- డా.కట్కూరిన్యాయ నిపుణుడు
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.