అత్యవసర పంట ప్రణాళికలు సిద్ధం చేయండి : సీఎస్ సంజయ్ జాజు

అత్యవసర పంట ప్రణాళికలు  సిద్ధం చేయండి :  సీఎస్ సంజయ్ జాజు
  •     వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా ప్లాన్ చేయాలి
  •      కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్​లో  సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో వర్షభావ పరిస్థితులను తట్టుకునేలా రైతాంగాన్ని ఆదుకునేందుకు  ప్రత్యేక పంట ప్రణాళికలు రూపొందించాలని  సీఎస్​ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయం, ప్రజారోగ్యం, తాగునీరు, విద్యా రంగాల్లో ప్రస్తుత పరిస్థితి, వర్షాకాల సన్నద్ధతపై ఆయన శనివారం అన్ని  కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.  కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ అంచనాల నేపథ్యంలో కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. 

మార్కెట్‌‌లో నాణ్యమైన విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఒకే రకమైన పంటలు వేయకుండా స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వంట గదుల మౌలిక వసతుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ వంట గదుల నిర్మాణానికి అవసరమైన అనువైన స్థలాలను ఆలస్యం కాకుండా గుర్తించాలని సూచించారు. 

ఫుడ్ సేఫ్టీ రూల్స్ కట్టుదిట్టంగా అమలు చేయండి

ఫుడ్ సేఫ్టీ రూల్స్ అత్యంత కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను సీఎస్ సంజయ్ జాజూ  ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడారు. కల్తీ ఆహార పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి, నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా, ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ రెండు విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చేలా వారం రోజుల్లోగా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.