హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం పిలుపునిచ్చింది. పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడుతున్న నిరుద్యోగ అభ్యర్థులు.. కొందరు స్వార్థపరుల రాజకీయ ప్రేరేపిత ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఎన్నికల లబ్ధి కోసం, సొంత రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను రోడ్లపైకి నెట్టి ఉచ్చులోకి లాగేందుకు కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది.
పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి జరుగుతున్న నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను బలోపేతం చేయడంతో పాటు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేందుకుగాను దశలవారీగా వ్యూహంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. పోలీసు ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే పరీక్షలు పూర్తి పారదర్శకంగా, కేవలం ప్రతిభ ఆధారంగానే జరుగుతాయని తెలిపారు.
