అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • పదేండ్లలో బీఆర్‌‌‌‌ఎస్ ఒక్క డబుల్ బెడ్‌‌రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని ఫైర్‌‌‌‌
  • సోషల్‌‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే 
  • వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం

కోల్​బెల్ట్/ జైపూర్​/చెన్నూరు/కోటపల్లి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌‌‌‌ఎస్ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా భీమారం మండల కేంద్రంలో డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం చెన్నూరు మండలం కిష్టంపేట, కోటపల్లి మండలం సర్వాయిపేట, కోటపల్లి, శంకరపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిని ఇండ్ల లబ్ధిదారులు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చెన్నూరు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనంపై కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా హాస్టల్‌‌లోకి చొరబడి విద్యార్థులను బెదిరించి బలవంతంగా తప్పుడు పద్ధతిలో వీడియోలు తీశారన్నారు. హస్టల్‌‌లోకి వచ్చిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, చెన్నూరు సీఐని మంత్రి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ, సొంతింటి కలను నెరవేర్చుతోందని చెప్పారు.

చెన్నూరు నియోజకవర్గానికి మరో 2 వేల ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో మొదటి విడత కింద మంజూరు చేసిన 3,500 ఇండ్లలో, 2 వేల ఇండ్ల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయని వెల్లడించారు. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఎక్కడా ఒక్క పెంకుటిల్లు, గుడిసె కనబడకుండా అందరికి స్లాబ్‌‌తో ఇండ్లు కట్టించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో మాజీ ప్రధాని 
ఇందిరా గాంధీ హయాంలో 2013లో కాంగ్రెస్ సర్కార్ పేదలకు ఇండ్లు, జాగాలను ఇచ్చిందని గుర్తుచేశారు.

రోడ్ల నిర్మాణానికి రూ.99 కోట్లు.. 

చెన్నూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.99 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణాలను చేపడుతామని చెప్పారు. గతంలో బీఆర్‌‌‌‌ఎస్ లీడర్లు ఇసుక, భూదందా, దొడ్డు బియ్యం దందాతో వందల కోట్ల ప్రజల సొమ్ము దండుకున్నారని ఫైర్‌‌‌‌ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ దందాలన్నింటికి అడ్డుకట్ట వేశామన్నారు. చెన్నూరు పట్టణంలో రోడ్ల విస్తరణలో వ్యాపారులు, స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అభినందించారు. రూ.1.60 కోట్ల డీఎంఎఫ్‌‌టీ నిధులతో బైపాస్ రోడ్డు నిర్మించామన్నారు. రూ.1.20 కోట్ల ఫండ్స్‌‌తో నిర్మిస్తున్న 20 షాపుల్లో పేద వ్యాపారస్తులకు ప్రాధాన్యత ఇచ్చి కేటాయించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. చెన్నూరు మైనారిటీ సంక్షేమ వసతి గృహంలో మధ్యాహ్న భోజనం విషయంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా పిల్లలతో అబద్ధాలు చెప్పించారని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, చెన్నూరు టౌన్ రూరల్ సీఐలు బన్సీలాల్, కృష్ణ, అధికారులు, సర్పంచులు, 
లీడర్లు ఉన్నారు.