పంజాగుట్ట, వెలుగు: తెలుగు యూనివర్సిటీని నాంపల్లిలోనే కొనసాగించాలని వర్సిటీ పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సమితి నాయకులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రత్నశ్రీ మాట్లాడారు. తాము తెలుగు వర్సిటీలో విద్యార్థులుగా చేరి ప్రస్తుతం అధ్యాపకులుగా పనిచేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం బాచుపల్లిలో నామమాత్ర సౌకర్యాలతోనే విధులు నిర్వహిస్తున్నామని, నాంపల్లి క్యాంపస్‌లో పూర్తి స్థాయి వసతులు ఉన్నాయని చెప్పారు. నాంపల్లి భవనాల్లో ప్రస్తుతం వివిధ కోర్సులు కొనసాగుతున్నాయని, విశ్వవిద్యాలయాన్ని ఇతరులకు కేటాయించకుండా పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నాంపల్లిలోని ఆడిటోరియాన్ని తక్కువ అద్దెకు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ప్రొఫెసర్ తిరుమలరావు సేకరించిన వివిధ ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్థలంలో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మరో స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వర్సిటీ అధ్యాపకులు,
పూర్వ విద్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
