- ఫ్రీ దర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం
- ఆదివారం ఒక్క రోజే రూ.54.30 లక్షల ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే ప్రాంగణం, కొండపైన దర్శన, ప్రసాద క్యూలైన్లు, దర్శన క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడాయి.
స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. ప్రధానాలయంలో నిర్వహించిన స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం రూ.54,30,877 ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.13,55,210, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.9,50,250, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.7.11 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.5,59,800 ఆదాయం సమకూరినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.
