భద్రాచలం, వెలుగు: భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన శ్రీభక్తరామదాసు భక్తమండలి ఆధ్వర్యంలో నిర్వహించే కోటి తలంబ్రాల మహాయజ్ఞం 11వ ఏడాదికి చేరింది. ఆదివారం భక్తులు వరి విత్తనాలను తీసుకొచ్చి సీతారాముల సన్నిధిలో ఈవో దామోదర్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ విత్తనాలను భక్తిప్రపత్తులతో నాటి, పంట పండిన తర్వాత వచ్చే వడ్లను గోటితో వలిచి శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణానికి సమర్పిస్తారు.
అంతకుముందు సీతారామచంద్రస్వామికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం, స్వర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ప్రాకార మండపంలో సీతారాములకు నిత్యకల్యాణం, సాయంత్రం దర్బారు సేవ చేపట్టారు. కాగా, స్వామి వారి సన్నిధిలో ఉన్న కుసుమహరనాథబాబా ఆలయంలో అర్చకులు విగ్రహాలకు కళావాహన వేదోక్తంగా నిర్వహించారు. రంగనాయకుల గుట్టపై ఉన్న ఈ ఆలయాన్ని అభివృద్ధిలో భాగంగా తొలగించనున్నారు. ఈ నేపథ్యంలో గుడిలోని విగ్రహాలకు పూజలు చేసి, శివాలయం సమీపంలో ఉన్న ప్రత్యేక గదికి తరలించారు.
