మణుగూరు, వెలుగు: హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం అశ్వాపురం మండలం గౌతమినగర్‌లోని తరంగిణి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంప్లాయీస్ యూనియన్ ఎనిమిదో అఖిల భారత మహాసభకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
దేశాభివృద్ధిలో అణుశక్తి ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న యూనియన్ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. హెవీ వాటర్ ప్లాంట్‌కు సంబంధించిన స్థానిక సమస్యలు, స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన, మెరుగైన వైద్య, గృహ వసతి సదుపాయాల అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీ బలరాం నాయక్‌ను కోరారు.
సమావేశంలో హెవీ వాటర్ ప్లాంట్ సీజీఎం ఘంటసాల శ్రీనివాస్, యూనియన్ జనరల్ సెక్రటరీలు కేవీ జయరాజ్, ఎ.శ్రీధరన్, ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.ఎ.జలీల్, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు ఎంకే బోసు, ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సింగు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
