ఫిఫా వరల్డ్ కప్‎లో ఈజిప్ట్‌‌‌‌ నయా హిస్టరీ.. పెనాల్టీ షూటౌట్‎లో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం 

ఫిఫా వరల్డ్ కప్‎లో ఈజిప్ట్‌‌‌‌ నయా హిస్టరీ.. పెనాల్టీ షూటౌట్‎లో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం 

ఆర్లింగ్టన్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఈజిప్ట్‌‌‌‌ చరిత్ర సృష్టించింది. నాకౌట్‌‌‌‌ పోరులో ఈజిప్ట్‌‌‌‌ పెనాల్టీ షూటౌట్ ద్వారా 4–2తో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించింది. ఈజిప్ట్ తన వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ చరిత్రలోనే నాకౌట్ రౌండ్ మ్యాచ్‌‌‌‌లో విజయం సాధించడం ఇదే తొలిసారి. నిర్ణీత సమయం, ఎక్స్‌‌‌‌ట్రా టైమ్ ముగిసేసరికి ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో ఈజిప్ట్ ఆటగాళ్లు మొహమ్మద్ సలా, మహమూద్ సాబెర్, రామీ రబియా కచ్చితమైన లక్ష్యంతో గోల్స్ కొట్టారు. 

ఆఖరిగా హోసామ్ అబ్దెల్మాగుయిడ్ కొట్టిన షాట్ నేరుగా నెట్‌‌‌‌లోకి దూసుకెళ్లడంతో ఈజిప్ట్ క్యాంప్‌‌‌‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియా ఆటగాడు హ్యారీ సౌటర్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌‌‌‌కు పైగా వెళ్లగా, లూకాస్ హెరింగ్టన్ కొట్టిన బంతి బార్‌‌‌‌కు తగిలి వెనక్కి వచ్చింది. ఆస్ట్రేలియా తరఫున జాక్సన్ ఇర్విన్, అవేర్ మాబిల్ మాత్రమే గోల్స్ చేయగలిగారు. అంతకుముందు మ్యాచ్ 13వ నిమిషంలోనే ఇమామ్ ఆషౌర్ హెడర్ ద్వారా గోల్ కొట్టి ఈజిప్ట్‌‌‌‌కు 1–-0 ఆధిక్యం అందించాడు. 

అయితే 55వ నిమిషంలో ఈజిప్ట్ డిఫెండర్ మొహమ్మద్ హనీ చేసిన తప్పిదం ఆ జట్టుకు శాపంగా మారింది. ఆస్ట్రేలియా ఆటగాడు ఐడెన్ ఓనీల్ కొట్టిన ఫ్రీ కిక్‌‌‌‌ను అడ్డుకునే క్రమంలో హనీ తలకు తగిలిన బంతి సొంత గోల్ పోస్ట్‌‌‌‌లోకి వెళ్లింది. ఈ ‘ఓన్ గోల్’ కారణంగా ఆస్ట్రేలియా 1–-1తో స్కోరును సమం చేసింది. ఒకే ప్రపంచకప్‌‌‌‌లో రెండు ఓన్ గోల్స్ చేసిన ఆటగాడిగా మొహమ్మద్ హనీ అపకీర్తిని మూటగట్టుకున్నాడు.