- విహారయాత్ర నిలిపివేసి ఫిట్నెస్ టెస్ట్ అనంతరం ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
- శనివారం భద్రాచలం నుంచి బయలుదేరిన లాంచీలు
భద్రాచలం, వెలుగు: గత నెలలో తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ వద్ద టూరిస్టులతో వస్తున్న లాంచీ సాంకేతిక కారణాలతో గోదావరి నదిలో ఆగిపోయింది. దీంతో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. ఈ కారణంతో పాపికొండల యాత్రకు ఏపీ సర్కార్ బ్రేక్ వేసింది. గతంలో ఇదే ప్రాంతంలో కచ్చలూరు వద్ద జరిగిన ప్రమాదంలో 47 మంది టూరిస్టులు జలసమాధి అయిన ఘటనను దృష్టిలో ఉంచుకొని లాంచీలకు ఫిట్నెస్ టెస్ట్లు నిర్వహించారు.
ధవళేశ్వరంలో ఇరిగేషన్ ఇంజనీర్లు టెస్ట్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాక లాంచీలను తిప్పడానికి అనుమతించారు. దీంతో భద్రాచలం, రాజమండ్రి నుంచి టూరిస్టులతో శనివారం లాంచీలు బయలుదేరాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరఘాట్, పోలవరం జిల్లా విలీన వీఆర్పురం మండలం పోచవరం నుంచి లాంచీలు తిప్పుతున్నారు.
కట్టుదిట్టమైన భద్రతతో..
టూరిస్టుల భద్రతే లక్ష్యంగా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. లాంచీ ఎక్కే ప్రతి టూరిస్టు ఆధార్ కార్డు, వివరాలు తీసుకుంటున్నారు. లాంచీ ఎక్కాక వారికి లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు. శిక్షణపొందిన సిబ్బంది, అధికారుల పర్యవేక్షణ మధ్య టూర్ కొనసాగుతోంది. ఫైర్ నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉంచారు. లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, టైర్లు, తాళ్లు సిద్ధం చేశాకే లాంచీ బయలుదేరుతుందని లాంచీ నిర్వాహకుడు పూనెం వీరభద్రం తెలిపారు.
