పెద్దకొత్తపల్లి,వెలుగు: అర్హులైన నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడానికే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని దశలవారీగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తీర్మలాపూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మంజూరై పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను స్పీడప్ చేయాలని ఏఈ రాజేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి కృష్ణయ్యకు సూచించారు. అనంతరం కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, గ్రామ సర్పంచ్ బి. రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బి. సత్యం పాల్గొన్నారు.
