- రెడ్డి ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తాకనియ్య : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలో మరో 884 రోజుల్లో బీసీలు అధికారంలోకి వస్తరు, దొరల ఆధీనంలో ఉన్న భూములు గుంచుకొని పేదలకు ఇస్తాం, మిషన్ 2028 ప్రారంభమైంది' అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం నిర్వహించిన 'రాజ్యాధికార సమరభేరి' సభలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో ఉన్న వెలమలు, వేల సంఖ్యలో ఉన్న రెడ్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారని, లక్ష్యల సంఖ్యలో ఉన్న బీసీలు మాత్రం ఎమ్మెల్యేలు కూడా కాలేకపోతున్నారన్నారు. మర్యాదగా వెళ్లిపోవాలని లేకపోతే మెడలు పట్టుకొని బయటకు గెంటేస్తాం అని హెచ్చరించారు. రెడ్ల పాలనపై 'సర్జికల్స్ట్రయిక్ 59', 'మిషన్ 2028' మొదలుపెట్టామని, 59 మంది రెడ్లను రాజకీయంగా ఖతం చేస్తామని, వారిని అసెంబ్లీ గేటు కూడా తాకనియ్యమని సవాల్ చేశారు.
హైదరాబాద్రాష్ట్రాన్ని పాలించిన నవాబు.. అధికారం నుంచి దిగిపోతూ రాష్ట్రంలోని భూములన్నింటినీ బడుగు, బలహీన వర్గాలకు రాశారన్నారు. 1954లో మంత్రిగా ఉన్న కొండా వెంకట రంగారెడ్డి రికార్డులు మార్చి దొరల పేర్లు ఎక్కించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు సైతం బయటపెడుతానన్నారు. ఈ సందర్భంగా 'వెలుగు' పేపర్ లో వచ్చిన 'దొర భూములు రైతులకే' అనే వార్తను ప్రదర్శించారు.
తాము అధికారంలోకి రాగానే దొరల చేతుల్లోని భూములు గుంజుకొని పేదలకు పంచుతామని ప్రకటించారు. ఎంబీటీ అధ్యక్షుడు అహ్మదుల్లా ఖాన్ మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లే టీఆర్పీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులు, మావోయిస్టుల ఏఐ వీడియోలు ప్రదర్శించారు. సభలో కొమిరిశెట్టి నర్సింహులు, మాజీ డీజీపీ పూర్ణచందర్రావు, వట్టె జానయ్య యాదవ్, మాదం రజనీ కుమార్ పాల్గొన్నారు.
