భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రం భద్రాద్రి కొత్తగూడెంలోని బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. బస్టాండ్‌లోకి వచ్చే, వెళ్లే ప్రయాణికులు డ్రైనేజీల నుంచి వస్తున్న దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పైకప్పు పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయోనన్న భయంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్టాండ్‌లోని మరుగుదొడ్ల పైప్‌లైన్ పగలడంతో దుర్గంధం వెదజల్లుతోంది.
బస్టాండ్ ఆవరణలో గోతులు ఉండటంతో బస్సుల రాకపోకలు కుదుపులతో సాగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఇటీవల రూ. కోటితో మరమ్మతులు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా, బస్టాండ్ పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. బస్టాండ్ అభివృద్ధికి సింగరేణి రూ.10 కోట్లు ఇస్తామని ప్రకటించినా, ఆర్టీసీ అధికారులు సరైన ఫాలోఅప్ చేయకపోవడంతో ఆ నిధులపై స్పష్టత లేకుండా పోయింది.
