జనారణ్యంలో కోతుల బెడద.. జనగామ జిల్లాలో పెరుగుతున్న కోతుల దాడులు

జనారణ్యంలో కోతుల బెడద.. జనగామ జిల్లాలో పెరుగుతున్న కోతుల దాడులు

జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో కోతుల దాడులు ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ లెక్కల ప్రకారం 2026లో మే నెల వరకు 1,105 మంది కోతుల దాడుల్లో గాయపడ్డారు. ఈ లెక్కన రోజుకు 8 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి వివరాలు ఇందులో లేవు.

వెటర్నరీ వైద్యుల ప్రకారం కోతి కరిచినా రేబిస్‌‌‌‌తో పాటు ఇతర బ్యాక్టీరియా సంక్రమించే ప్రమాదం ఉంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 2024లో 1,675 మంది, 2025లో 1,812 మంది కోతుల దాడులకు గురయ్యారు.

జనగామ, బచ్చన్నపేట, కొడకండ్ల, నర్మెట్ట మండలాల్లో దాడులు ఎక్కువగా నమోదవగా, పాలకుర్తిలో 2025, 2026లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జిల్లా విస్తీర్ణం 2,138 చ.కి.మీ. కాగా, అటవీ ప్రాంతం కేవలం 1.07 చ.కి.మీ. మాత్రమే ఉంది. అడవులు, పండ్ల చెట్లు తగ్గిపోవడంతో కోతులు గ్రామాల్లోకి వచ్చి ఇళ్లను, కూరగాయలు, పండ్ల తోటలను ధ్వంసం చేస్తున్నాయి.

వాటిని పట్టి ఇతర ప్రాంతాల్లో వదిలినా తిరిగి వస్తుండటంతో సమస్య కొనసాగుతోంది. కోతుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. కోతుల బెడదను తగ్గించేందుకు జనగామ మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఏపీకి చెందిన కోతులు పట్టే బృందంతో ఒక్కో కోతికి రూ.350 చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 900 కోతులను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించారు.