ఏటీసీ, ఐటీఐ స్టూడెంట్స్‌‌‌‌కు మస్త్ డిమాండ్ .. దిగ్గజ కంపెనీల్లో కొలువులు

ఏటీసీ, ఐటీఐ స్టూడెంట్స్‌‌‌‌కు మస్త్ డిమాండ్ .. దిగ్గజ కంపెనీల్లో కొలువులు
  •  ఉట్నూర్​ ఏటీసీలో 99 మందికి, వరంగల్ కౌశల్ మహోత్సవ్‌‌‌‌లో 260 మందికి ఉద్యోగాలు
  •   టాటా మోటార్స్, యాపిల్, ఎల్‌‌‌‌ అండ్‌‌‌‌ టీ, మేధా సర్వో డ్రైవ్స్, ఐటీసీ లిమిటెడ్, స్టాండర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాంటి ప్రముఖ కంపెనీలకు ఎంపిక  
  •   ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఏటీసీలు, ఐటీఐ కోర్సుల్లో మార్పులు
  •   ప్రాక్టికల్ శిక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. జాబ్ మేళాల్లో సత్ఫలితాలనిస్తున్న సర్కార్ ప్రణాళికలు

హైదరాబాద్, వెలుగు:  ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న జాబ్ మేళాల్లో వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న యువతకు డిమాండ్‌‌‌‌ పెరిగింది. కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో జరిగిన ఉద్యోగ నియామక ప్రక్రియలను పరిశీలిస్తే, మారుతున్న పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా అభ్యర్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అడ్వాన్స్‌‌‌‌డ్ ట్రైనింగ్ సెంటర్స్ (ఏటీసీలు), ఐటీఐ విద్యార్థులు ఈ మేళాల్లో పెద్ద ఎత్తున పాల్గొని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను ఆకట్టుకుంటున్నారు. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోని యువతకు సైతం స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 

టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, మేధా సర్వో డ్రైవ్స్ వంటి దిగ్గజ సంస్థలు ఈ మేళాల ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యా విధానంలో వస్తున్న మార్పులు ఈ విజయాలకు దోహదం చేస్తున్నాయి. యువతలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించడం వల్ల నిరుద్యోగిత శాతం క్రమంగా తగ్గుముఖం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఉట్నూర్ ఊపేసింది.. 


ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని అడ్వాన్స్‌‌డ్ ట్రైనింగ్ సెంటర్‌‌‌‌లో ఈ సంవత్సరం మే 15న నిర్వహించిన వర్చువల్ జాబ్ మేళా అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన, గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. టాటా మోటార్స్, ష్నైడర్ ఎలక్ట్రిక్, యాపిల్, ఐషర్  ఓరియంట్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు ఈ నియామక ప్రక్రియలో పాల్గొన్నాయి. ఈ మేళాలో మొత్తం 100 మంది ఏటీసీ విద్యార్థులు పాల్గొనగా, అందులో ఏకంగా 99 మంది ప్రతిభావంతులు ఎంపికై రికార్డు సృష్టించారు. ఇది అక్కడ శిక్షణ పొందిన అభ్యర్థుల  నైపుణ్య ప్రమాణాలకు అద్దం పడుతోంది. వారికి లభిస్తున్న అత్యాధునిక శిక్షణ వల్లే యువత ఈ స్థాయి విజయాలను సాధించగలుగుతున్నారని వెల్లడైంది. గిరిజన ప్రాంత విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి కార్పొరేట్ రంగంలో అవకాశాలు కల్పించడంలో ఉట్నూరు ఏటీసీ కీలక పాత్ర పోషించింది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా అభ్యర్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడం వల్లే ఇంతటి భారీ స్థాయిలో ఎంపిక సాధ్యమైందని విద్యా రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


298 మంది పాల్గొంటే.. 260 మంది ఎంపిక


వరంగల్ వేదికగా ఈ ఏడు జూన్ 27న నిర్వహించిన కౌశల్ మహోత్సవ్ జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఒక పెద్ద వేదికగా నిలిచింది. ఈ భారీ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న 90కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాయి. ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభించగా, మొత్తం 4,500 మందికి పైగా అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 2,200 మంది ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరు కాగా, వెయ్యి మందికి పైగా అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఐటీసీ లిమిటెడ్, స్టాండర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎల్ అండ్ టీ చెన్నై, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, విజన్ ఇండస్ట్రీస్  యాక్షన్  వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ మేళాలో కొలువుల జాతరను నిర్వహించాయి. వృత్తి విద్యా కోర్సులు చదివిన విద్యార్థుల విషయానికొస్తే, ఐటీఐ  ఏటీసీల నుంచి 298 మంది అభ్యర్థులు పాల్గొనగా, వారిలో 260 మంది ఎంపిక కావడం విశేషం. ఇందులో ఐటీఐ విద్యార్థులు 138 మంది, ఏటీసీ విద్యార్థులు 122 మంది ఉద్యోగాలను సాధించి తమ సత్తా చాటారు.  


పోటీ పడుతున్న కంపెనీలు 


నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 2న నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అభ్యర్థులు పోటెత్తారు. ఎల్ అండ్ టీ ప్రైవేట్ లిమిటెడ్, మేధా సర్వో డ్రైవ్స్, వరుణ్ మోటార్స్, అపోలో ఫార్మసీ, వైఎస్‌‌కే ఇన్ఫోటెక్, టాటా స్ట్రైవ్, ఐపీఎస్ సొల్యూషన్స్, హెచ్-1 హెచ్ఆర్ సొల్యూషన్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 6 వేల మందికి పైగా అభ్యర్థులు ఉపాధి ఆశతో ఈ మేళాకు హాజరు కాగా, రికార్డు స్థాయిలో 1,750 మంది అభ్యర్థులు వేర్వేరు విభాగాలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ ఎంపికల్లో ఐటీఐ విద్యార్థులు 90 మంది, ఏటీసీ విద్యార్థులు 44 మంది కొలువులు సాధించగా, మిగిలిన విద్యా అర్హతలు కలిగిన 1,616 మంది ఇతర అభ్యర్థులు నియామక పత్రాలను అందుకున్నారు. స్థానికంగా ఉన్న యువతకు తక్షణ ఉపాధి కల్పించడంలో ఈ నిజామాబాద్ మెగా మేళా విజయవంతమైంది.   


రైల్వే రవాణా రంగ పరికరాల కంపెనీలు సైతం


హైదరాబాద్‌‌లోని సనత్‌‌నగర్ ప్రభుత్వ ఐటీఐలో జూలై 1న నిర్వహించిన జాబ్ మేళా విద్యార్థుల నైపుణ్యాల పరిశీలనకు ఒక గీటురాయిగా నిలిచింది. ఈ మేళాలో దేశీయంగా రైల్వే రవాణా రంగ పరికరాల తయారీలో పేరొందిన మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ  పాల్గొంది. సంస్థ ప్రతినిధులు అభ్యర్థుల ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని, సాంకేతిక ప్రతిభను నిశితంగా పరిశీలించి నియామకాలు చేపట్టారు. ఈ మేళాలో మొత్తం 200 మంది అభ్యర్థులు పాల్గొనగా, అందులో సనత్‌‌నగర్ ఐటీఐకి చెందిన విద్యార్థులు 96 మంది ఉన్నారు. కఠినమైన వడపోత ప్రక్రియ అనంతరం తుది రౌండ్‌‌లో 13 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరైనప్పటికీ, కంపెనీ నిర్దేశించుకున్న కఠినమైన సాంకేతిక ప్రమాణాల కారణంగా ఎంపికల సంఖ్య పరిమితంగానే ఉంది.  
విదేశాల్లో కొలువులకు టామ్​కామ్     
 తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌పవర్ కంపెనీ (టామ్​కామ్​)తో  విదేశాలలో ఉద్యోగాలు సాధించాలనుకునే ఆసక్తి గల 4,750 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నైపుణ్యాల కొరతను భర్తీ చేయడానికి తెలంగాణ యువత సిద్ధంగా ఉందనడానికి ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య నిదర్శనం. ఇప్పటికే దాదాపు 3 వేల మందిని వివిధ దేశాలకు టామ్ కామ్​ ఆధ్వర్యంలో ఉద్యోగాలను పంపారు. మొత్తంగా చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యోగ మేళాలు కేవలం స్థానిక కొలువులకే పరిమితం కాకుండా గ్లోబల్ మార్కెట్‌‌కు అవసరమైన మానవ వనరులను కూడా సిద్ధం చేస్తున్నాయి. ఏటీసీ, ఐటీఐ విద్యార్థుల అద్భుతమైన ఎంపికల శాతాన్ని విశ్లేషిస్తే, సాంకేతిక రంగంలో ప్రాయోగిక శిక్షణకు ఉన్న ప్రాధాన్యత స్పష్టంగా అర్థమవుతుంది. పారిశ్రామిక శిక్షణా సంస్థలను మరింత బలోపేతం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఉట్నూరు: 99 మంది (ఏటీసీ)
వరంగల్: 260 మంది 
(138 ఐటీఐ + 122 ఏటీసీ)
సనత్‌‌నగర్ (హైదరాబాద్): 13 మంది (ఐటీఐ)
నిజామాబాద్: 134 మంది (90 ఐటీఐ + 44 ఏటీసీ)