న్యూఢిల్లీ: భారతదేశంలో రోడ్డు, రహదారుల రంగానికి చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) క్యూబ్ హైవేస్ ట్రస్ట్, ఈ నెలలోనే రూ.5 వేల కోట్ల ఐపీఓను ప్రారంభించనుంది. కంపెనీ డ్రాఫ్ట్ పేపర్ల ప్రకారం, ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ఉంటుంది. అంటే, ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న వాటాలను (యూనిట్లను) ఐపీఓ ద్వారా కొత్త ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఇన్విట్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లాంటిదే.
రోడ్లు, పవర్ ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని (టోల్ వసూళ్లు, ప్రభుత్వ చెల్లింపులు) ఇన్వెస్టర్లకు డివిడెండ్‌ల రూపంలో క్రమం తప్పకుండా పంపిణీ చేసే ఒక ప్రత్యేక ట్రస్ట్ ఇది. క్యూబ్ హైవేస్ ట్రస్ట్ ఈ ఏడాది మార్చి 31నాటికి దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో విస్తరించి ఉన్న 27 కీలకమైన హైవే ప్రాజెక్టులను (దాదాపు 8,754 లేన్ కిలోమీటర్లు) నిర్వహిస్తోంది.
వీటి సగటు లీజు కాలపరిమితి ఇంకా 18 ఏళ్లు ఉంది. క్యూబ్ ఇన్విట్ తన యూనిట్ హోల్డర్లకు ఆర్థిక సంవత్సరం 2025–26 లో యూనిట్‌కు రూ.13.77 చొప్పున మొత్తం రూ.1,851 కోట్ల డిస్ట్రిబ్యూషన్‌ను (లాభాల పంపిణీ) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 9 ప్రాజెక్టులను కొనుగోలు చేయడంతో, ఈ ట్రస్ట్ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.36,842 కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి ఈ సంస్థకు రూ.17,768 కోట్ల నికర అప్పు ఉంది.
