- కన్సల్టెన్సీ ఎస్‌బీఐ క్యాప్స్ నియామకంలో జాప్యంపై ఆందోళన
- ఫేజ్-1 టేకోవర్, ఫేజ్-2 విస్తరణపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి
- కిషన్‌రెడ్డి ... మెట్రోపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి
- ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇచ్చేందుకు సహకరించండి..
- ఆలస్యమైతే వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదమని ఆందోళన
- టర్మ్స్ఆఫ్ రిఫరెన్స్ త్వరగా ఖరారు చేసి
- రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని రిక్వెస్ట్
- ఇప్పటికే నోడల్ ఆఫీసర్‌గా మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్‌ను నియమించినట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి హైదరాబాద్ మెట్రో అత్యంత కీలకమైనదని, ఈ ప్రాజెక్టు ఇకపై మరింత ఆలస్యం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కేంద్రమంత్రులతో భేటీ అయి రెండు వారాలు అవుతున్నా మెట్రోపై తీసుకున్న నిర్ణయాలేవి ముందుకు సాగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఆలస్యమైతే వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరారు.
పెండింగ్ అంశాలపై ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ కిషన్‌రెడ్డితోపాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం వేర్వేరుగా లేఖలు రాశారు. జూన్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎస్‌బీఐ క్యాప్స్‌ను అధికారికంగా నియమించలేదని తెలిపారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదని, దీంతో మెట్రో ఫేజ్-–1 బదిలీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందన్నారు.
దీనివల్ల మెట్రో రోజువారీ నిర్వహణలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఎస్‌బీఐ క్యాప్స్ నియామకం ఆలస్యం కావడం వల్ల మెట్రో ఫేజ్-–2 సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు (డీపీఆర్) కేంద్ర అనుమతులు కూడా ఆలస్యమవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దీంతో నిధుల సమీకరణ ముందుకు సాగడం లేదని, ప్రాజెక్టు ప్రారంభం మరింత వాయిదా పడుతోందని తెలిపారు. మెట్రో ఫేజ్–-2 నిర్మాణానికి భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమవుతాయని ఆయన వివరించారు. అందుకే అదే సంస్థ (ఎస్‌బీఐ క్యాప్స్) ఫేజ్-–2కు అవసరమైన ఆర్థిక నమూనాను రూపొందించాలని నిర్ణయించారన్నారు. దీర్ఘకాలిక రుణాల సమీకరణ మార్గాలను చూడాలని కోరారు. నిధుల సమీకరణ మార్గాలను, ప్రాజెక్టు అమలుకు అవసరమైన ఆర్థిక వ్యూహాన్ని రూపొందించాలని నాటి సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.
కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలి
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ విషయంలో కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలతో స్వయంగా మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎస్‌బీఐ క్యాప్స్‌ను తక్షణమే నియమించాలని అభ్యర్థించారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను ఖరారు చేయించాలని రిక్వెస్ట్ చేశారు. అలా జరిగితే మెట్రో ఫేజ్–-1 బదిలీ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని, దాంతోపాటు ఫేజ్-2 విస్తరణ పనులు కూడా ఎలాంటి జాప్యం లేకుండా ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైన నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని.. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించిందని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరమని, ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయని, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్రో ఫేజ్-–2 విస్తరణ అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు.
అందుకే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిపాలనా ఆమోదం ఇవ్వాలని కోరారు. అలాగే, ఆర్థిక ఆమోదం కూడా ఇవ్వాలని లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో ఫేజ్-–1ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని వివరించారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మరింత ఆలస్యం చేయవద్దని కోరారు. వెంటనే ఆమోదించి, నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
- జూన్ భేటీ నిర్ణయాలు కార్యరూపం దాల్చలే
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో గత జూన్ 23న కీలక సమావేశం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. జూన్ 24న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యామని, కిషన్‌రెడ్డి సమక్షంలోనే ఈ సమావేశాలు జరిగాయని సీఎం లేఖలో గుర్తు చేశారు. ‘‘ఆ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్–-1 బదిలీపై చర్చించారు. ఫేజ్-–2 విస్తరణపై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయినప్పటికీ, ఇప్పటి వరకు వాటిలో ఒక్క నిర్ణయం కూడా అమల్లోకి రాలేదు. ఈ జాప్యం ఆందోళన కలిగిస్తోంది’’ అని పేర్కొన్నారు.
ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్’ (ఎస్‌బీఐ క్యాప్స్)కు కొన్ని బాధ్యతలు అప్పగించాలని అంగీకరించారని, హైదరాబాద్ మెట్రో ఫేజ్-–1 విలువ నిర్ధారణ బాధ్యతను ఈ సంస్థకు ఇవ్వాలన్నారు. ఆర్థిక పరిస్థితుల సమీక్ష బాధ్యతను కూడా అప్పగించాలని, తెలంగాణ ప్రభుత్వానికి మెట్రో బదిలీకి అవసరమైన ఆర్థిక పరిశీలన బాధ్యతలను ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చాల్సి ఉందని, ఈ రీఫైనాన్సింగ్ అవకాశాలను కూడా ఎస్‌బీఐ క్యాప్స్ పరిశీలించాలని నాడు నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారన్నారు.
- ఆలస్యమైతే వేల కోట్ల అదనపు భారం
మెట్రో ప్రాజెక్టు అమల్లో ప్రతి నెలా జాప్యం జరుగుతోందని, దీనివల్ల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ‘‘మార్కెట్‌లో ధరల పెరుగుదల ఒక కారణం. వడ్డీ భారం పెరగడం మరో కారణం. నిర్మాణ సామగ్రి వ్యయం పెరగడంలాంటి కారణాలు కూడా ఉన్నాయి. వీటివల్ల ప్రభుత్వంపై వేల కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుంది” అని పేర్కొన్నారు. అందుకే ఇకపై ఎలాంటి ఆలస్యం చేయవద్దని కోరారు. అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
