- అప్పటివరకు మాలలతో కలిసి పోరాటం కొనసాగిస్తానని వెల్లడి
- మాలల ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో మహాధర్నా
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో మాలల రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని సవరించాల్సిందేనని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రోస్టర్ విధానం వల్ల జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేంత వరకు మాలలతో కలిసి పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో మాల ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో చైర్మన్ మంచాల లింగస్వామి అధ్యక్షతన మహా ధర్నా చేపట్టారు.
ఈ ధర్నాకు మంత్రి వివేక్ వెంకటస్వామి మద్దతు తెలిపి, మాట్లాడారు. రిజర్వేషన్ల వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తూనే ఉన్నానని, షమీమ్ అక్తర్ కమిటీ నివేదికతో మాలలకు కేవలం 5 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కిందన్న విషయంపై కేబినెట్ సబ్ కమిటీలో లెక్కలతో సహా వివరిస్తున్నానని తెలిపారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల ఆధారంగా చేసిన వర్గీకరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించానని ఆయన గుర్తుచేశారు. ఈ అంశంపై త్వరలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. రోస్టర్ విధానం వల్ల ఆర్టీసీ నోటిఫికేషన్‌లో మాలలకు 5 శాతం రిజర్వేషన్లకు గాను 2.8 శాతం మాత్రమే కేటాయించారని, ఇప్పటికే పలు నోటిఫికేషన్‌లో వందకు పైగా ఉద్యోగాలను మాలలు కోల్పోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
- మాల నిరుద్యోగ యువతకు అన్యాయం: సుద్దాల దేవయ్య
ఎస్సీ వర్గీకరణ ద్వారా రోస్టర్ విధానం వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి సుద్దాల దేవయ్య అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోస్టర్ పాయింట్లను సవరించి మాలలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ మాలలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ మాట్లాడుతూ.. రోస్టర్ విధానం వల్ల రాష్ట్రంలోని అనేక యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్, ఎల్‌ఎల్‌బీ, ఎంబీబీఎస్, డెంటల్ అడ్మిషన్లలో మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. ప్రభుత్వం చూచిచూడనట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు. ధర్నాలో జాతీయ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్, నాయకులు పాల్గొన్నారు.
