- గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలుస్తున్న భారీ నిర్మాణాలు
- సుప్రీంకోర్టు ఆదేశం ఉన్నా డోంట్ కేర్
- బిల్డర్లు కడ్తరు.. కిరాయిలకు ఇస్తరు
- టౌన్ ప్లానింగ్ అండా.. దండా
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాదాపూర్ అయ్యప్ప సొసైటీల్లోని అక్రమ బిల్డింగుల్లో రూల్స్‌కు విరుద్ధంగా స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్ నడిపిస్తున్నారు. రెసిడెన్షియల్జోన్లో పర్మిషన్‌లేకుండా కట్టిన అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను అద్దెకు తీసుకుని క్లాస్‌రూమ్‌లుగా మారుస్తున్నారు. బోర్డులు ఏర్పాటు చేస్తే ఎవరైనా కనిపెడతారేమోనని గుట్టుగా తరగతులు కొనసాగిస్తున్నారు. అడ్మిషన్ కోసం అడిగే పేరెంట్స్, విద్యార్థులకు, కేవలం జీపీఎస్ లొకేషన్ పంపించి రప్పించుకుంటున్నారు.
సదరు కాలేజీలు ‘బ్రాండ్’ కావడంతో తల్లిదండ్రులు కూడా ఎక్కడ చదువు చెప్తున్నారు? అక్కడ వాతావరణం ఎలా ఉందన్నది పట్టించుకోకుండా జాయిన్చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లలో పార్కింగ్‌ను , కామన్ ఏరియాలను కూడా సదరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇతర అవసరాలకు వాడుకుంటున్నాయి. ఒక్క క్యాంపస్ లో ఏం తక్కువ 500 నుంచి వెయ్యి మంది వరకు స్టూడెంట్స్ఉండడంతో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
పర్మిషనే లేదు.. ఫైర్ సేఫ్టీ ఎక్కడిది ?
పర్మిషన్‌లేకుండా కట్టిన అపార్ట్మెంట్లలో కాలేజీలు, స్కూల్స్నడుస్తుండడంతో ఫైర్‌సేఫ్టీ జాడ లేకుండా పోయింది. ఫైర్‌సేఫ్టీ కోసం పర్మిషన్అడిగితే ఎలాగూ ఇవ్వరు కాబట్టి ఆ వైపుగా దృష్టి పెట్టడం లేదు. దీంతో ఫైర్ ఎగ్జిట్‌లు, ఎమర్జెన్సీ మార్గాలు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకుండానే క్లాసులు నడుస్తున్నాయి. పైగా సెల్లార్లలో డైనింగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోయినా తమ పిల్లలను అడ్మిట్చేసే తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు.
ఒక జిల్లాలో అనుమతులు, మరోచోట కొనసాగింపు..
కళాశాలల యాజమాన్యాలు కాలేజీల అనుమతులను ఒక జిల్లాలో తీసుకొని మరో జిల్లాలో నడిపిస్తున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అనుమతులు పొందిన వందల కాలేజీలు అయ్యప్ప సొసైటీల్లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇంత జరగుతున్నా విద్యాశాఖ, మున్సిపల్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్తో సహా ఒక్కరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు.
టౌన్ ప్లానింగ్ అండతో బిల్డర్ల దందా
నిజానికి అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చంద్రనాయక్తండాల్లో గురుకుల్ ట్రస్ట్భూములు ఉన్నాయి. ఈ భూములపై వివాదంతో సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు కూడా ఉన్నాయి.
అయినా, ఇక్కడి బిల్డర్లంతా సిండికేట్గా మారి టౌన్ ప్లానింగ్ అధికారుల అండతో ఏడెనిమిది అంతస్థులకు తగ్గకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. వీటిని స్కూల్స్, కాలేజీలకు రెంట్‌కు ఇస్తూ దండుకుంటున్నారు.
