వానాకాలం వచ్చినా హైదరాబాద్లో తగ్గని డిమాండ్.. జూన్లో బుక్చేసిన ట్యాంకర్లు2,45,231.. వాటర్ బోర్డు చరిత్రలో రికార్డు

వానాకాలం వచ్చినా హైదరాబాద్లో తగ్గని డిమాండ్.. జూన్లో బుక్చేసిన ట్యాంకర్లు2,45,231.. వాటర్ బోర్డు చరిత్రలో రికార్డు
  • గత ఏడాది 56,527 మాత్రమే 
  • వాటర్ ​బోర్డు చరిత్రలో రికార్డు 
  • వెస్ట్, క్యూర్​ ఏరియా నుంచే ఎక్కువ 
  • ఎల్​నినో ఎఫెక్ట్​తో  గ్రౌండ్​ వాటర్​పెరగక తిప్పలు 


హైదరాబాద్​సిటీ, వెలుగు : వాటర్ బోర్డు చరిత్రలో రికార్డు స్థాయిలో ట్యాంకర్ల బుకింగ్​లు జరుగుతున్నాయి. ఎండాకాలంలో భూగర్భ జలాలు తగ్గి డిమాండ్​ఎక్కువగా ఉందనుకుంటే...వానాకాలం వచ్చినా బుకింగ్​ల సంఖ్య ఆ లెవెల్​లోనే ఉంది. వేసవిలో అంటే ఏప్రిల్​, మే నెలల్లో అత్యధికంగా రోజుకు 16 వేల నుంచి 18 వేల వరకు వాటర్​ట్యాంకర్ల బుకింగ్స్​జరిగాయి.

జూన్​మొదటి వారం నుంచి ట్యాంకర్ల బుకింగ్​సంఖ్య తగ్గుతుందని భావించామని, కానీ రెండు వారాల కింద అనూహ్యంగా 18 నుంచి 20వేలు, ఇప్పుడు కొంచం తగ్గి 13వేల నుంచి 15వేలకు చేరిందని వాటర్​బోర్డు ప్రకటించింది.  సాధారణంగా ఈ సీజన్​లో ఎప్పుడూ 4వేల వరకే బుకింగ్​లు వస్తుంటాయని, కానీ వర్షాభావ పరిస్థితులతో డిమాండ్​అస్సలు తగ్గడం లేదని అధికారులు చెప్తున్నారు. గతంలో జూలై నెలల్లో 24 గంటల్లో డెలివరీ చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు మూడు రోజుల వరకు పడుతోందని చెప్తున్నారు. 

ఒక క్యాన్​ నంబర్​కు ఎనిమిదే.. అయినా..

వాటర్​బోర్డు రూల్స్​ప్రకారం ఒక్కో క్యాన్​ నెంబర్​పై నెలకు 8 ట్యాంకర్లకు మించి బుక్​చేసుకునే అవకాశం లేదు. ఇంతకుముందు ఏ వినియోగదారుడు కూడా నెలకు 8 ట్యాంకర్లు బుక్​చేసుకున్నది లేదు. కానీ ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడి కారణంగా వెస్ట్​సిటీలోనే చాలామంది కస్టమర్లు 8 దాటి..12 ట్యాంకర్ల వరకు బుక్​చేస్తే అధికారులు రిజెక్ట్​చేస్తున్నారు.

దీంతో ప్రైవేట్​ట్యాంకర్ల వైపు మళ్లుతున్నారు. అపార్ట్​మెంట్ల విషయానికి వస్తే 25 వరకు ఫ్లాట్స్​ఉన్న అపార్ట్​మెంట్​కు నెలకు 30 ట్యాంకర్లు, 100 నుంచి 150 ఫ్లాట్స్​ఉన్న అపార్ట్​మెంట్​అయితే 60 ట్యాంకర్ల వరకే సరఫరా చేయాలన్న రూల్​ ఉంది. కానీ సగం వరకు అపార్ట్​మెంట్ల నుంచి వీటికి మించి బుకింగ్స్​వస్తున్నాయని అధికారులు అంటున్నారు. 


ఇక్కడే ఎక్కువ నీటి సమస్య  

వెస్ట్​సిటీలో, కొత్తగా బోర్డు పరిధిలో విలీనమైన ప్రాంతాల్లోనూ నీటి సమస్య ఎక్కువగా ఉంది. బోర్లు ఎండిపోవడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. నానక్​రామ్​గూడ, కోకాపేట, మణికొండ, వట్టి నాగులపల్లి, తెల్లాపూర్​, గండిపేట, నార్సింగి, కొండాపూర్​, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్​, ఎస్​ఆర్​నగర్​వంటి ప్రాంతాల్లో వాటర్​ట్యాంకర్లకు డిమాండ్​ఎక్కువగా ఉంది. 

హైరైజ్​ బిల్డింగులతోనే సమస్య..

హైదరాబాద్​ నగరంలో పెద్దగా బుకింగ్​లు లేవని, ప్రధానంగా క్యూర్​ పరిధిలోని ప్రాంతాలు, వెస్ట్ సిటీ నుంచే అత్యధికంగా ట్యాంకర్లు బుక్ ​అవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద హోటల్స్, హైరైజ్ ​బిల్డింగులు, కొన్ని టౌన్​షిప్స్ వెయ్యి నుంచి రెండువేల అడుగుల వరకు బోర్లు వేస్తుండడంతో చుట్టుపక్కల ఆరు కిలోమీటర్ల వరకు నీళ్లు రావడం లేదని, అందుకే వాటర్​ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని చెప్తున్నారు. హాస్టల్స్, మెస్​లు, టిఫిన్​సెంటర్లు, ఇండ్లు, అపార్ట్​మెంట్లలో నీళ్లు రాక ట్యాంకర్లను బుక్​ చేస్తున్నారని అంటున్నారు. 

మూడు నెలల  నీటి ట్యాంకర్ల బుకింగ్​ ఇలా..

సంవత్సరం    ఏప్రిల్​    మే    జూన్​
2024    1,74,376    1,63,421    74,860
2025    2,18,167    2,09,724    56,527
2026    2,37,328    2,40,465    2,45,231