గిరిజన గ్రామాలకు పక్కా రోడ్లు..ప్రతి విలేజ్కు బీటీ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో సర్కార్ ప్రణాళికలు

గిరిజన గ్రామాలకు పక్కా రోడ్లు..ప్రతి విలేజ్కు బీటీ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో సర్కార్ ప్రణాళికలు
  • 1,143 ఆవాసాల్లో 1,193 కి.మీ మేర కొత్త రోడ్లు
  • రూ.1,550 కోట్లతో అంచనాలు
  • ఇప్పటి వరకు 332 పంచాయతీలకు  లేని కనెక్టివిటీ రోడ్లు 
  • రాష్ట్రంలో 139 చోట్ల అడవులు, వాగులతో రోడ్డు వేయలేని పరిస్థితి 
  • రూ.6,294 కోట్లతో హ్యామ్ రోడ్ల పనులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మారుమూల పల్లెలు, గిరిజన తండాల రవాణా కష్టాలు తీరనున్నాయి. ప్రతి పంచాయతీకి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు 100 శాతం కనెక్టివిటీ, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఏండ్ల తరబడి సరైన దారిలేక, వాగులు వంకలు దాటుతూ ఇబ్బందులు పడుతున్న పల్లెలు, తండాలు, గూడేలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం రూ.1,550 కోట్లతో కార్యాచరణ సిద్ధం చేసింది.

అదేవిధంగా, రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో రూ.6,294.81 కోట్లతో 2,162 రోడ్ల పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు సైతం మంజూరు చేసింది. దీని ద్వారా 7,449.50 కిలోమీటర్ల మేర రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నేటికీ 332 గ్రామ పంచాయతీలకు సరైన రహదారి సౌకర్యం లేదు. వర్షమొస్తే ఆ గ్రామాలకు వెళ్లాలన్నా.. ఆ పల్లెల నుంచి ఇతర ప్రాంతాలకు రావాలన్నా నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక అత్యవసర వైద్యం చేయించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో 68 వేల కిలోమీటర్ల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్..

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పరిధిలో ప్రస్తుతం 68,708 కిలోమీటర్ల రోడ్ల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ ఉంది. ఇందులో 26,503 కిలోమీటర్లు మాత్రమే బీటీ రోడ్లు ఉన్నాయి. మిగిలిన రహదారులను కూడా దశలవారీగా తారు రోడ్లు నిర్మించాలని, ఇప్పటికే ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 12,780 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇప్పటికే 12,426 గ్రామాలకు అన్ని కాలాల్లో ప్రయాణించే విధంగా రవాణాకు అనుకూలంగా రోడ్లు ఉన్నాయి.

మిగిలిన వాటిలో 35 గ్రామాలకు పీఎంజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వై–IV  కింద, మరో 171 పంచాయతీలకు ఇతర పథకాల కింద రోడ్లు మంజూరు చేశారు. ఈ పనులు పూర్తయితే మొత్తం 12,698 గ్రామాలకు పక్కా రోడ్డు సౌకర్యం అందుబాటులోకి రానున్నది. తద్వారా ఈ పంచాయతీలకు పూర్తిస్థాయి కనెక్టివిటీ లభించనుంది. కనెక్టివిటీ రోడ్లు లేని 332 పంచాయతీల కోసం నిధులు కూడా కేటాయించారు. 121 పంపచాయతీలకు సీఆర్ఆర్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్ నిధులతో రోడ్లు నిర్మించనున్నారు. పీఎంజీఎస్​వై–IV కింద 35 గ్రామాలకు రోడ్లు వేయనున్నారు. 

హ్యామ్ రోడ్లకు అనుమతులు.. 

రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో హ్యామ్ కింద రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఫేజ్-1 కింద మొత్తం రూ.6,294.81 కోట్లతో 2,162 రోడ్ల పనులు చేపట్టనున్నారు. దీంతో 7,449.50 కిలోమీటర్ల మేర రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 17 ప్యాకేజీలుగా విభజించగా.. ఇప్పటికే 14 ప్యాకేజీలకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేశారు. అయితే, జిల్లాల వారీగా నిధులు, రహదారుల వివరాలను ప్రభుత్వం ఖరారు చేసింది.

మెదక్ జిల్లాలో 586 కిలోమీటర్ల మేర 166 రోడ్ల నిర్మాణానికి అత్యధికంగా రూ.500.30 కోట్లు కేటాయించారు. కరీంనగర్ జిల్లాలో 541.16 కిలోమీటర్ల మేర 197 రోడ్ల కోసం రూ.454.71 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 555.67 కిలోమీటర్ల మేర 134 రోడ్ల కోసం రూ.453.79 కోట్లు వెచ్చించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 513.81 కిలోమీటర్ల మేర 99 రోడ్ల నిర్మాణానికి రూ.421.77 కోట్లు, వరంగల్ జిల్లాలో 477.34 కిలోమీటర్ల మేర 153 రోడ్ల కోసం రూ.401.10 కోట్లు కేటాయించారు. ఖమ్మం జిల్లాలో 524.38 కిలోమీటర్ల మేర 175 రోడ్ల నిర్మాణానికి రూ.399.50 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 514.21 కిలోమీటర్ల మేర 183 రోడ్ల అభివృద్ధి కోసం రూ.377.48 కోట్లను ఖర్చు చేయనుంది.

770 గిరిజన ఆవాసాలకు రోడ్లు.. 

రాష్ట్రంలోని మొత్తం 23,170 ఆవాసాల్లో 21,276 చోట్ల రోడ్లు ఉన్నాయి. మిగిలిన 1,894 ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఇందులో 770 గిరిజన తండాలు ఉన్నాయి. అదేవిధంగా, 1,124 ఆవాసాల్లో 1,193 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,550 కోట్లు అవసరమని అంచనా వేశారు. అటవీ ప్రాంతాలు, కొండల మధ్య ఉన్న 139 ఆవాసాలకు రోడ్ల నిర్మాణం సాధ్యం కాదని తేల్చారు. ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. ఈ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది.

అభయారణ్యాల్లో ఉండటం, దట్టమైన అడవులు, లోతైన వాగులు, ఎత్తయిన కొండలు ఉండటంతో బీటీ రోడ్లు వేయడం కష్టమని ఆఫీసర్లు చెప్తున్నారు. జనాభా తక్కువగా, ఎత్తయిన కొండలపై ఉన్న రెండే రెండు గ్రామాలకు మాత్రం రోడ్డు వేయడం సాధ్యం కాదని అధికారులు తేల్చారు. అయితే, అటవీ ప్రాంతాల్లోని తండాలకు రోడ్లు వేయాలంటే కేంద్ర అటవీశాఖ అనుమతులు, భూసేకరణ పూర్తి చేయాల్సి ఉండగా.. ఆ మేరకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.