ఉత్తరాదిలో భారీ వర్షాలు.. ముంబైని వీడని వాన.. బలమైన గాలుల వల్ల ఎయిర్ పోర్ట్ క్లోజ్

ఉత్తరాదిలో భారీ వర్షాలు.. ముంబైని వీడని వాన.. బలమైన గాలుల వల్ల ఎయిర్ పోర్ట్ క్లోజ్

న్యూఢిల్లీ/ముంబై: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలపడడంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై మహానగరాన్ని వాన ముంచెత్తడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒడిశా, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలోనూ విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది.

ముంబైలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల 24 గంటల్లో దాదాపు 300 ఎంఎం వర్షపాతం నమోదైంది. గంటకు 42 నాట్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్​పోర్టులో రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే కార్యకలాపాలను గంటపాటు పూర్తిగా నిలిపివేశారు. పెను గాలులకు కుర్లాలో ఓ చెట్టు నేలకూలి ఓ వృద్ధుడు మరణించాడు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ముంబైలోని స్కూళ్లు, కాలేజీలకు బీఎంసీ సెలవు ప్రకటించింది.

ఒడిశా, కేరళ రాష్ట్రాలకు ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారింది. ఈరోజు చంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాలీ – దిఘా మధ్య ఉత్తర ఒడిశా తీరాన్ని దాటొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. కేరళలోనూ ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అధికారులు ఈరోజు, రేపు పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు.

కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, ఆకస్మిక వరదలు వచ్చే ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కేరళ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు సూచించారు. కాగా, ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈరోజు నుంచి గురువారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అన్ని జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు.

  • రాయగఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తప్పిన ప్రమాదం

మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలోని అదోషి జలపాతానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. భారీ వర్షాలకు జలపాతం ప్రవాహం సడెన్​గా పెరిగింది. దీంతో 12మంది టూరిస్టులు నీటి మధ్యలో చిక్కుకున్నారు. బాధితుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారందరినీ కాపాడారు.