- మీడియా ముందుకొస్తే సుమోటోగా తీసుకుంటాం
- క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి హెచ్చరిక
- గతంలో చేసిన వ్యాఖ్యలపై కత్తి వెంకటస్వామి వివరణ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. ఆదివారం గాంధీ భవన్‌లో జరిగిన కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం, పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహబూబ్ నగర్ ఎన్నారై సెల్ ప్రతినిధి అమరేందర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీపై గతంలో వ్యాఖ్యలు చేసిన కత్తి వెంకటస్వామి వ్యవహారాన్ని కూడా కమిటీ పరిశీలించింది.
ఆయన మాట్లాడిన రికార్డులను చెక్ చేశామని, దీనిపై ఆయన వివరణ ఇస్తూ.. ఆరోజు ఎమోషనల్‌గా అలా మాట్లాడానని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారని వివరించారు. దీనిపై తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీలో ఏవైనా అంతర్గత సమస్యలుంటే పీసీసీ అధ్యక్షుడు లేదా ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలి తప్ప, బహిరంగంగా మీడియా ముందు మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మల్లు రవి హెచ్చరించారు. మీడియాలో వచ్చే వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని క్రమశిక్షణా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
