ఒక్క దెబ్బతో అందరినీ లేపేసేవాళ్లం.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్పై ట్రంప్‌‌ సంచలన వ్యాఖ్యలు

ఒక్క దెబ్బతో అందరినీ లేపేసేవాళ్లం.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్పై ట్రంప్‌‌ సంచలన వ్యాఖ్యలు
  • ఆ దేశంలోని మిగిలిన నాయకత్వాన్ని తుడిచిపెట్టగలం. కానీ అలా చేయం
  • ఖమేనీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అనుకుంటున్నా
  • ఇరాన్‌‌ ప్రజలు, నేతలవి మొసలి కన్నీళ్లు కావొచ్చని కామెంట్‌‌
  • అమెరికాకు నాగరికత లేదు.. గౌరవం లేదని ఇరాన్‌‌ కౌంటర్‌‌‌‌
  • వ్యక్తులను చంపగలరు.. కానీ ఆశయాలను చంపలేరని ఫైర్​

న్యూఢిల్లీ: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంత్యక్రియల వేడుకల సమయంలో ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిగిలి ఉన్న అగ్రనాయకత్వాన్ని కేవలం ఒక్క దెబ్బతో  తుడిచిపెట్టే సామర్థ్యం అమెరికాకు ఉందని హెచ్చరించారు. అయితే, అలా చేస్తే భవిష్యత్తులో చర్చలు జరపడానికి అవతలి పక్షంలో  ఎవరూ మిగలరు కాబట్టే తాను ఆ పని చేయడం లేదని అన్నారు.

యాక్సియోస్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘‘ఇరాన్ నాయకులంతా అక్కడే (అంత్యక్రియల్లో) ఉన్నారు. ఒక్క దెబ్బతో వారందరినీ మట్టుబెట్టగలం, కానీ మేం ఆ పని చేయలేదు. ఎందుకంటే ఆ తర్వాత మాతో డీల్ మాట్లాడడానికి ఎవరూ ఉండరు.. ప్రస్తుతం వాళ్లు ఒప్పందం కోసం బతిమాలుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు. అంత్యక్రియల కార్యక్రమాలు ముగిసే వరకు ఇరుపక్షాల మధ్య చర్చలకు వారంపాటు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్టు ట్రంప్ వెల్లడించారు. ఈలోగా ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోబోవని ఆయన చెప్పారు.  ఖమేనీ వీడ్కోలు సభలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ప్రజలు కన్నీళ్లు 
పెట్టుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకాలం తాను ఇరాన్ ప్రజలు ఖమేనీని ద్వేషిస్తున్నారని భావించినట్టు చెపారు. ‘‘ఏమో నేననుకున్నదే నిజమేమో.. బహుశా అవన్నీ మొసలి కన్నీళ్లు కావొచ్చు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

  • ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం

ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించింది. జులై 4 నాటికి 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న అమెరికాకు.. ఖమేనీ మరణంపై ఇరాన్ ప్రజలు వ్యక్తం చేస్తున్న శోకం, ఆవేదన అర్థం కావని పేర్కొన్నది.

ఎందుకంటే అమెరికాకు ‘‘నాగరికత గానీ, చరిత్ర గానీ, కనీస గౌరవం గానీ లేవు’’ అంటూ చురకలంటించింది. వ్యక్తులను చంపగలరు.. కానీ వారి ఆశయాలను కాదని సెటైర్​ వేసింది. ‘‘మీరు అయతుల్లా ఖమేనీని చంపారు. కానీ నిజానికి మీరు ఒక పెర్ఫ్యూమ్ సీసాను పగులగొట్టారు.. దాని సువాసన ఇప్పుడు అన్ని వైపులా వ్యాపించింది” అని వ్యాఖ్యానించింది.