ఇంజినీరింగ్ కాలేజీల మాయాజాలం.. ‘బీ’ కేటగిరీ.. బడా స్కామ్! సీట్ల వివరాలు చెప్పకుండానే అడ్మిషన్ల దందా

ఇంజినీరింగ్ కాలేజీల మాయాజాలం.. ‘బీ’ కేటగిరీ.. బడా స్కామ్! సీట్ల వివరాలు చెప్పకుండానే అడ్మిషన్ల దందా
  • సీట్ల ప్రకటనలో ఇంజినీరింగ్ కాలేజీల మాయాజాలం
  • కంటికి కనిపించని అక్షరాలతో.. సిటీ పేజీల్లో యాడ్స్ 
  • సీట్ల వివరాలు చెప్పకుండానే కాలేజీల అడ్మిషన్ల దందా
  • డిమాండ్ ఉన్న కోర్సులను దాచిపెట్టి బ్లాక్ మార్కెట్ దారికి
  • అన్నీ అమ్ముకున్నాకే నామమాత్రపు నోటిఫికేషన్లు 


హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు ‘బీ కేటగిరీ’ సీట్లు పెద్ద బిజినెస్ అయిపోయాయి. సర్కారు నిబంధనలను కాగితాలకే పరిమితం చేస్తూ, అడ్మిషన్ల ప్రక్రియలో కాలేజీలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. మెరిట్ ఉన్న స్టూడెంట్లను దూరం చేసి, లక్షలు ఇచ్చిన వారికే సీట్లు కట్టబెట్టడమే లక్ష్యంగా స్కెచ్‌లు వేస్తున్నాయి. నోటిఫికేషన్ల దగ్గరి నుంచి అప్లికేషన్ల స్వీకరణ వరకు అంతా గోల్‌మాల్ చేస్తూ.. పారదర్శకతను తుంగలో తొక్కుతున్నాయి.

సీట్ల వివరాల ప్రకటనల మాయాజాలం మెరిట్ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. డిమాండ్ ఉన్న కోర్సుల సీట్లను ముందే అమ్ముకొని, రికార్డుల కోసం నామమాత్రపు ప్రకటనలతో సరిపెడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో 151 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, రెండు ప్రైవేటు వర్సిటీల్లో కలిపి సుమారు లక్షకు పైగా సీట్లు ఉన్నాయి. వీటిలో 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఈ సీట్ల భర్తీలో పారదర్శకత ఉండాలని సర్కారు ఆదేశించినా.. కాలేజీలు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధాన దినపత్రికల్లో స్పష్టమైన ప్రకటనలు ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కాలేజీలు సిటీ పేజీల్లో కేవలం రెండు, మూడు ఇంచుల సైజులో, అక్షరాలు కూడా కనిపించకుండా మొక్కుబడి ప్రకటనలు ఇస్తున్నాయి. అడ్మిషన్ల కోసం అభ్యర్థులు ఫోన్ చేద్దామంటే ప్రకటనల్లో ఇచ్చిన నంబర్లు కలవడం లేదు. ఒకవేళ కలిసినా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు.

సీఎస్ఈ సీట్ల డేటా హైడ్.. 

ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ వంటి బ్రాంచీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని పెద్ద కాలేజీలు ప్రకటనల్లోనే సీఎస్​ఈ సీట్ల వివరాలను ప్రకటించడం లేదు. లోపాయికారీగా ఆ సీట్లను లక్షలాది రూపాయల డొనేషన్లకు అమ్ముకొని ఈ డ్రామా ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ బ్రాంచ్ లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో పేపర్ ప్రకటనలో ఇవ్వాలని రూల్ ఉన్నా.. తమ కాలేజీ వెబ్ సైట్ లో చూసుకోండి అని తప్పించుకుంటున్నాయి.

మరికొన్ని కాలేజీలైతే ఖర్చు తగ్గించుకోవడానికి, స్టూడెంట్లకు సరైన సమాచారం అందకుండా రెండు కాలేజీలు కలిపి గ్రూపుగా ప్రకటనలిస్తూ విద్యార్థులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ కేటగిరీలో సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీలు ఉండటం గమనార్హం. దీనికి సర్కారు పెద్దలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా ఉన్నారనే ధీమా ఆ మేనేజ్మెంట్లలో కన్పిస్తోందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అయితే, చాలా కాలేజీల్లో రూ. 10 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా కంప్యూటర్ సైన్స్ గ్రూపుల సీట్లకు డిమాండ్ ఉండటంతో, మేనేజ్మెంట్లు తెరవెనుక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. 

నిబంధనలు గాలికి.. 

మేనేజ్మెంట్ల సీట్ల భర్తీకి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు గత నెల 29 నుంచి ఈ నెల 15 వరకు అడ్మిషన్ల షెడ్యూల్ ఇచ్చారు. కానీ, ఆన్ లైన్ లో అప్లై చేసుకునేందుకు కాలేజీల వెబ్ పోర్టల్స్ సరిగ్గా పనిచేయడం లేదు. మూడు భాషల పేపర్లలో నోటిఫికేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. చాలా కాలేజీలు ప్రకటనలు ఇవ్వడం లేదు. ఇచ్చినా.. తక్కువ ధరకు ప్రకటనలు ఇచ్చే పేపర్లో ఇస్తున్నారు. ఇంకొన్ని ఎక్కడో ఒక మూల చిన్న ప్రకటనతో సరిపెడుతున్నారు.

బ్రాంచ్ వారీగా సీట్లు, ఎన్ఆర్ఐ కోటా, ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు వివరాలు వెల్లడించాలి. కానీ, ఆ వివరాలు సరిగా చెప్పడం లేదు. కొన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకునేందుకు కాలేజీలకు వెళ్తే.. లోపలికి రానివ్వడం లేదని పేరెంట్స్ చెప్తున్నారు. అయితే, కొన్ని పెద్ద కాలేజీలే నిబంధనలను బేఖాతర్ చేస్తుండటంతో చిన్న కాలేజీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ, టీజీసీహెచ్ఈ అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ.. నిబంధనలు అమలయ్యేలా చూడాలని, పారదర్శకంగా బీ కేటగిరి సీట్ల​ అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేరెంట్స్, స్టూడెంట్స్ యూనియన్లు కోరుతున్నాయి.